జగన్ కోటలో మరోసారి మీసం మెలేయాలనుకుంటున్న టీడీపీ!

Vasishta

కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. వై.ఎస్.కుటుంబానికి ఇది కంచుకోట అనే పేరుంది. ఏ ఎన్నిక జరిగినా ఇక్కడ ఆ పార్టీదే గెలుపనే భావన ఉంది. అయితే అలాంటి చోట కూడా టీడీపీ పట్టు సాధించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. త్వరలోనే తమ పట్టేంటో చాటిచెప్పేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.


          నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీలో ఉన్న జోష్ అంతాఇంతా కాదు. ఇదే జోష్ తో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని అధికారపార్టీ భావిస్తోంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేసేందుకు పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ ప్లాన్ వేసింది. అందుకు కడప జిల్లానే వేదికగా చేసుకోబోతోంది. గతంలో పెండిగ్ లో పడిన రాజంపేట పురపాలికకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


          కడప జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఏకైన నియోజకవర్గం రాజంపేట మాత్రమే. అక్కడి నుంచి గెలిచిన మేడా మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం విప్ గా ఉన్నారు. రాజంపేట ఎన్నికకు సంసిద్ధం కావాలని, శ్రేణులను ఈమేరకు సన్నాహపరిచాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని మేడా మల్లికార్జున రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చిస్తూ ఏ క్షణంలో అయినా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని. ఇందుకు సన్నద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.


          ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డిని ఓడించి టీడీపీ పులివెందుల గడ్డపై మీసం మెలేసింది. ఇదే సీన్ రాజంపేటలో కూడా రిపీట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. కోర్టులో ఉన్న కేసులను త్వరలోనే సెట్ రైట్ చేసి ఎన్నికలకోసం వెళ్లేందుకు ప్లాన్ వేసింది ప్రభుత్వం. సో.. జగన్ కోటలో మరో సంగ్రామానికి  సమయం దగ్గరపడుతోంది. మరి విజేత ఎవరో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: