మోదీ ఇవ్వబోతున్న మరో షాక్..! వచ్చే ఏడాదే జనరల్ ఎలక్షన్స్..!!

Vasishta

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయా..? వివిధ రాష్ట్రాల్లో పాగా వేసుకుంటూ వస్తున్న మోదీ .. ఇప్పుడు ఒకేసారి ఎన్నికలకోసం వ్యూహం రచిస్తున్నారా.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకోసం 2019 కంటే ముందుగానే సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని మోదీ ప్రభుత్వం ఎంతోకాలంగా ఆలోచిస్తోంది. ఎన్నికల పేరుతో వృధా ఖర్చును తగ్గించే దిశగా నీతి అయోగ్ సూచించిన సంస్కరణలను అమలు చేసేందుకు ప్లాన్ వేస్తోంది. ఏక కాలంలో సార్వత్రిక, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఖర్చు చాలావరకూ తగ్గుతుందనేది మోదీ టీం ఆలోచన. ఇందులో భాగంగా మొదట సుమారు 10 రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చింది.


వచ్చే ఏడాది నవంబర్ - డిసెంబర్ మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019 మేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా అసెంబ్లీలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఏకకాల ఎన్నికలకు మార్గం సుగమం చేసేలా వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విడివిడిగా ఎన్నికలు జరుగుతుండటం వల్ల పాలనాపరమైన సమస్యలతో పాటు నిర్వహణా వ్యయం భారీగా వెచ్చించాల్సి వస్తోందని ప్రధాని మోదీ భావిస్తున్నారు.


2019 ఏప్రిల్ లో నిర్వహించాల్సిన పార్లమెంట్ ఎన్నికలను వచ్చే ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర్రాలతో కలిసి నిర్వహించే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ తెలిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు.


పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు కొన్ని రాష్ట్రాలు తమ అసెంబ్లీలను ముందుగానే రద్దు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల ప్రజావ్యతిరేక స్ధానంలో సింపథీ వస్తుందని పలు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: