టీటీడీ కొత్త ఛైర్మన్ ఈయనేనా...??

Vasishta

          టీటీడీ ఛైర్మన్ గిరీ కోసం రాష్ట్రానికి చెందిన నేతలు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలవారూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన బడా పారిశ్రామిక వేత్తలు సైతం ఒక్క ఛాన్స్.. అంటూ వేడుకుంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి చెందిన వ్యక్తులకే టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ పైరవీలు మొదలయ్యాయి. తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ పదేపదే కోరుతున్నారు. కానీ ఒకరికి ఒకే పదవి ఉండాలనే నిబంధన పెట్టడంతో చాలా మంది ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గారు.


          తాజాగా టీటీడీ ఛైర్మన్ రేసులో ముందున్న వ్యక్తి బీదా మస్తాన్ రావు. నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ కీలక నేత. ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. జిల్లాలోని నేతలందరినీ కలుపుకుపోయే తత్వం ఉండడం మస్తాన్ రావుకు ప్లస్ పాయింట్. చంద్రబాబు ఏ పని అప్పగించినా తు.చ. తప్పకుండా పాటిస్తారనే పేరుంది.


          గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీద మస్తాన్ రావుకు ఏదైనా మంచి పదవి ఇస్తామని చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. రాజధాని నిర్మాణ సలహా మండలి సభ్యుడిగా నియమించారు. అయితే అంతకుమించిన పదవి ఇవ్వాలని జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎన్నోసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారు. దీంతో.. త్వరలోనే ఆయన్ను టీటీడీ ఛైర్మన్ స్థానంలో కూర్చోబెడతారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వారం, పదిరోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: