పవన్ కల్యాణ్.. ఈ అంశంపై మౌనం ఎందుకో..!?

Chakravarthi Kalyan
చంద్రబాబు సర్కారు మొన్నటి ఐఏఎస్ ల బదిలీల్లో ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ఈ నియామకం వివాదాస్పదమైంది. ఎందుకంటే.. ఈ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తారాదికి చెందిన ఐఏఎస్. టీటీడీ ఈవో పోస్టును దక్షిణాది ఐఏఎస్ లకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 


ఇలా దక్షిణాదివారికే ఇవ్వడానికి ఓ కారణం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణ అంతా ఆగమ  శాస్త్రాల నియమాల ప్రకారం జరుగుతుంది. ఈ నియమాలకు ఉత్తారాదివారి నియమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల టీటీడీ ఈవో పోస్టును ఎప్పుడు తెలుగువారికే ఇస్తుంటారు. సాధ్యమైనంతవరకూ అందులోనూ బ్రాహ్మలకే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 


ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆనవాయితీని పక్కకు పెట్టి మరీ అనిల్ కుమార్ సింఘాల్ ను ఎంపిక చేయడం వెనుక ఉత్తారాదికి చెందిన ప్రముఖల లాబీయింగ్ ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్వామీజీలు ఈ అంశంపై స్పందించారు. మరికొందరు కోర్టుకు కూడా వెళ్తామంటున్నారు. దక్షిణాది పై ఉత్తరాది పెత్తనాన్ని వ్యతిరేకించే పవన్ కల్యాణ్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకూ స్పందించలేదు. 


ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించాలని దక్షణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై పవన్ ఇంతవరకు స్పందించకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన అధికారికి ఈ పదవిని కట్టబెట్టడంపై దక్షిణాది ఐఏఎస్ లు అసంతృప్తితో ఉన్నారని... దీనిపై పవన్ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పవన్ ప్రశ్నిస్తే.. చంద్రబాబు సర్కారు స్పందించే అవకాశం ఉందన్నది వారి ఆశాభావం. మరి జనసేనాని పెదవి విప్పుతారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: