జగన్ కూర్చొనే కుర్చీ, ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారు అన్నీ ప్రభుత్వ ఆస్తులే...!!

Shyam Rao
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జగన్ కు చెందిన లోటస్ పాండ్, బెంగళూరులోని మంత్రి టవర్స్ ను అటాచ్ చేయడంతో, ఇంకా జగన్ రాష్ట్రానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, జగన్ సొంత రాష్ట్రానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. జగన్ వస్తే అమరావతిలో ఇల్లు కట్టించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేతకు నివాసం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సంశయించదని ఆయన తెలిపారు.


రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయామనే నిరాశతో, వైసీపీ నేతలు ఒత్తిడికి గురై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పండుగ వాతావరణంలో సచివాలయం ప్రారంభమై, ఉద్యోగులంతా ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రా ద్రోహుల పార్టీగా వైసీపీ మారిపోయిందన్నారు. తెలుగువారు గర్వించేలా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తుంటే.. ‘సింగపూర్‌కు అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నార’ని వైసీపీ నేత శ్రీకాంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉమా తప్పుబట్టారు. శ్రీకాంతరెడ్డి తీరు చూస్తుంటే ఆయన స్థానికతపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి ఒక ప్రకటనలో మండిపడ్డారు.


జప్తు చేయాల్సిన ఆస్తులు జగన్ వద్ద ఇంకా ఉన్నాయని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. జగనపై పన్నెండు కేసుల్లో చార్జిషీట్లు దాఖలైతే అందులో ఎనిమిది కేసుల్లో మాత్రమే ఆస్తుల జప్తు జరిగిందని తెలిపారు. జగన్‌ తన తప్పులను ఒప్పుకొని అక్రమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని తెలుగు యువత కార్యక్రమాల కార్యదర్శి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు.


ఈడీ జగన్‌ ఆస్తులను అటాచ్‌ చేయడంతో ఆయన అవినీతి వాస్తవమేనని రుజువైందని ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.1250 కోట్ల ఆస్తులు అటాచ్‌ అయ్యాయని రామయ్య చెప్పారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆస్తులు దోచుకున్న జగన్‌ ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమని హెచ్చరించారు. జగన్‌కు నైతికత ఉంటే జగన్‌ ఆ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాలతో వైసీపీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నట్లు వెల్లడించారు. జగన్ కూర్చొనే కుర్చీ, ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారు అన్నీ ప్రభుత్వ ఆస్తులేనని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల కడుపు కొట్టి జగన సంపాదించిన ఆస్తులన్నీ ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని విజయవాడలో డిమాండ్‌ చేశారు. జగన కుటుంబానికి చెందిన పాస్‌పోర్టులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే విజయ్‌మాల్యాలా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని ఎస్సీ కార్పొరేషన చైర్మన జూపూడి ప్రభాకర్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: