టీడీపీ మహేశ్ బాబును.. తెగ వాడేసుకుంటుందా..!?

Chakravarthi Kalyan
విపరీతమైన అభిమాన గణం ఉన్న తెలుగు సినీ హీరోల్లో మహేశ్ బాబు ఒకరు. తండ్రి కృష్ణవారసత్వం నటనతో పాటు అశేష అభిమానులూ ఆయన సొంతమయ్యారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ ఫ్యాన్ పవర్ ను వాడుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోందా.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో తేడా వస్తే.. అందుకు విరుగుడుగా మహేశ్ మంత్రం జపించబోతోందా.. ? అన్న అనుమానాలు వస్తున్నాయి. 

మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ తరపున ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఆయనతో ఉన్న సంబధాలను ఉపయోగించుకుని మహేశ్ బాబును టీడీపీ ప్రచారానికి వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం మహేశ్ బాబు సొంత గ్రామం బుర్రిపాలెం పర్యటన అందుకు నాంది పలికినట్టు కనిపిస్తోంది. సొంత ఊరు బాగు కోసమంటూ బుర్రిపాలెం వచ్చిన మహేశ్ బాబు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

మహేశ్ బాబు.. టీడీపీ ప్రచారకర్తగా మారతారా..

బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబు.. తన సొంత కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకూ ప్రచారకర్తగా పని చేయడం టీడీపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. మహేశ్ బాబు చేత టీడీపీ నాయకులు డ్వాక్రా మహిళలకు కోటి రూపాయల రుణాలను అందజేశారు. సర్కారు కార్యక్రమాలపై నిరుపేదలకు ఇళ్ల స్థలపట్టాల పంపిణీ కూడా మహేశ్ చేత చేయించడం ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. 

వాడకమంటూ మొదలుపెడితే చంద్రబాబు కంటే బాగా ఎవరూ వాడలేరని ఓ పొలిటికల్ సామెత. మహేశ్ బాబు విషయంలో అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మరి మహేశ్ బాబు తన సర్కారీ ప్రచారాన్ని సొంత గ్రామానికి.. సొంత బావ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా లేదా అన్నది భవిష్యత్  చెబుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం మహేశ్ ప్రచారం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: