ఆమరణ దీక్ష - జగన్ మరో కేసీఆర్ అవుతారా...!?

Chakravarthi Kalyan
జగన్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరు రోజుల దీక్ష తర్వాత ఆయన్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించేశారు. అయితే జగన్ ఆసుపత్రిలో ఎలాంటి ద్రవాహారం తీసుకోవడం లేదు. ఈ విషయం వైద్యులే చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన కేసీఆర్ దీక్ష గుర్తుకురాకమానదు. 

అప్పట్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో ఆమరణ దీక్ష ప్రారంభించారు కేసీఆర్. ఆయన్ను మొదట ఖమ్మం ఆసుపత్రికి ఆ తర్వాత నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అయితే వైద్యులు ఎలాంటి ఫ్లూయిడ్స్ ఎక్కించినా.. తాను మాత్రం ఎలాంటి ద్రవ, ఘన ఆహారం తీసుకోనని కేసీఆర్  భీష్మించారు. దాదాపు 14 రోజులకు పైగా ఆయన నిమ్స్ లో దీక్ష కొనసాగించారు. 

లగడపాటి రాజగోపాల్ వంటి సమైక్యవాదులు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని ఎన్నాళ్లైనా దీక్షలు చేయవచ్చని ఎగతాళి చేసినా కేసీఆర్ పట్టువీడలేదు. లగడపాటి అప్పట్లో చెప్పింది కూడా నిజమే. ఫ్లూయిడ్స్ తీసుకుని ఎన్నాళ్ళైనా దీక్షలు చేయవచ్చు. ప్రాణాలకు ముప్పు ఉండదు. కానీ శరీరం బాగా దెబ్బతింటుంది. ఏదేమైనా సరే దీక్ష విరమించనని కేసీఆర్ పట్టుదలతో ఉన్న సమయంలోనే 2009 డిసెంబర్ 9 అర్థరాత్రి చిదంబరం తెలంగాణ ఇస్తామని ప్రకటించేశారు. కేసీఆర్ ను హీరోను చేశారు. 

మరి ఇప్పుడు జగన్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక హోదా కోసం ప్రారంభించిన దీక్షను ఆసుపత్రిలోనూ కొనసాగిస్తారా.. ఫ్లూయిడ్స్ ఎక్కించుకునే కేసీఆర్ తరహాలోనే ఎన్నిరోజులైనా దీక్ష చేస్తారా.. లేక.. ఎలాగూ భగ్నం చేశారు కాబట్టి దీక్ష విరమించి మరో మార్గంలో హోదా కోసం పోరాడతారా.. అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి జగన్ ఎలాంటి స్కెచ్ గీస్తారో..!? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: