టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!

‘అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్‌’ అనే సామెత ఊరికే రాలేదు - మరోసారి అదే నిజమైందనటానికి ఇదే ఋజువు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని అవమానకరంగా దూషించి, దౌర్జన్యం, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారక తిరుమల రావు ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది.

 

ఆరంజ్ ట్రావెల్స్ విషయంలో 2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంతో పాటు, కొందరు అధికారులపై కేసినేని నాని- కేసినేని ట్రావెల్స్ యజమాని నాయకత్వంలో, కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే  ఆరోపణలు వచ్చాయి.

 

ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ  నేతలపై సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వారంతా ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యానికి క్షమాపణలు చెప్పారు. ఆ క్షమాపణలు చెప్పిన తీరూ మరింత అసహ్యకరంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఆ నలుగురు టీడీపీ నేతలకు దాదాపు రెండేళ్ళ తరవాత నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను జూన్‌ నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఐపీఎస్‌పై గూండాగిరి పేరుతో ఒక ఆర్టికిల్ కూడా ప్రచురితమైంది. ఇది చదివిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ పత్రిక కథనాన్ని సుమోటోగా పరిగణించి కేసు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులందరికీ ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కేశినేని నానికి నోటీసులు అందలేదనిఒక  న్యాయవాది వివరించారు. దీంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది.

 

నాడు ఐపీఎస్ బాలసుబ్రమణ్యంగారిపై అహంభావంతో విర్రవీగిన ఆ నలుగురి తీరు భరించలేక పోయారు అమరావతి వాసులు. ప్రభుత్వ ఉద్యోగులపై, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు, చివరకు సాధారణ కార్యకర్తల దౌర్జన్యం అత్యంత గర్హనీయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: