కేంద్రం కమిటీ - అయినా జల రాజకీయాల‌కు నో బ్రేక్‌..?

RAMAKRISHNA S.S.
తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న జల వివాదాలకు రాజకీయ రంగు పులుముకుని, ఎన్నికల వేళ సెంటిమెంట్‌గా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలు, ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన చర్చల సారాంశం మేరకు ఈ కమిటీ ఉనికిలోకి వచ్చింది.


కేంద్ర జలశక్తి చైర్మన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నలుగురు ప్రతినిధులు ఉంటారు. వీరితో పాటు కృష్ణా , గోదావరి బోర్డుల చైర్మన్లు, కేంద్ర జల వ్యవహారాల నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, బనకచర్ల వంటి కీలక ప్రాంతాల్లో నీటి మళ్లింపుపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, శాస్త్రీయంగా పరిష్కార మార్గాలను సూచించడం.


ప్రస్తుతం తెలంగాణలో జల వివాదాలు రాజకీయ చదరంగంలో ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఏపీ ప్రభుత్వం జల దోపిడీ చేస్తోందని, రేవంత్ సర్కార్ దీనిని అడ్డుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ముఖ్యంగా నల్లమల సాగర్, బనకచర్ల ప్రాంతాల్లో తెలంగాణ ప్రయోజనాలకు గండి పడుతోందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే జల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని నిరూపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేశారు. అయితే, దీనిని బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది.


కమిటీలు పరిష్కారం చూపుతాయా ?
కేంద్రం కమిటీ వేసినంత మాత్రాన జల రాజకీయాలు ఆగిపోతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. దీనికి ప్రధాన కారణాలు.. నీళ్ల పంపకాల అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ప్రజల్ని రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలకు ఓట్ల పరంగా లాభిస్తుంది. జల వివాదాలు చట్టపరంగా, సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైనవి. కమిటీ నివేదిక ఇచ్చినా, దానిని అమలు చేసే క్రమంలో మళ్ళీ అభ్యంతరాలు రావడం సహజం.


కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికంగా ఘర్షణలను తగ్గించే ప్రయత్నం కావొచ్చు కానీ, క్షేత్రస్థాయిలో రాజకీయ లబ్ధి కోసం పార్టీలు చేసే 'నీళ్ల పోరు' మాత్రం ఆగదు. ప్రజల్లో ఎవరు ఎక్కువ 'నీళ్ల సెంటిమెంట్' రగిల్చగలిగితే వారికే రాజకీయ అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేంద్ర కమిటీ ఇచ్చే నివేదిక ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: