రంగా వారసురాలు ఆశా పొలిటికల్ ఆశలు ఫలించేనా..?
ఆశా కిరణ్ విజయవాడ నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఆమె విజయవాడలో ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనకుండా నేరుగా విశాఖపట్నం వెళ్లడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రంగా గారి విగ్రహానికి విజయవాడలో పూలమాల వేసి ఉంటే వచ్చే మైలేజ్, విశాఖలో రాలేదన్నది సుస్పష్టం. కొద్దిరోజుల క్రితం మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆశా కిరణ్‌పై ప్రజల్లో, ముఖ్యంగా రంగా అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. అయితే, వర్ధంతి రోజున ఆమె చేసిన ప్రసంగాలు ఆ ఆసక్తిని నిలబెట్టుకోలేకపోయాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఆమె, తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా వివరించలేకపోయారు. తాను ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పడం కంటే, గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలను ప్రశ్నించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే నేతలకు ఉండాల్సిన 'విజన్'ను ప్రతిబింబించలేదన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. వంగవీటి రంగా పేరున్న బలం ఆశా కిరణ్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అయినప్పటికీ, సరైన వ్యూహకర్తలు లేకపోవడం వల్ల తొలిరోజు ఆమె అడుగులు తడబడ్డాయనిపిస్తోంది. మెజారిటీ వర్గాన్ని ఆకర్షించడంలో ఆమె విఫలమయ్యారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే కాబట్టి, మున్ముందు ఆమె తన లోపాలను సరిదిద్దుకుని రంగా వారసత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి.