నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది.. అనిల్‌కుమార్ సెలైన్స్ వెనక..?
నెల్లూరు రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీసీ సామాజిక వర్గ నేతగా, దూకుడున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్, పార్టీ కష్టకాలంలోనూ పెద్దగా స్పందించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నెల్లూరు మేయర్ రాజీనామా వైఫల్యమా ? వ్యూహమా ?
ఇటీవల నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, 54 మంది కార్పొరేటర్లలో దాదాపు 42 మంది టీడీపీలోకి వెళ్లడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకప్పుడు నగరాన్ని తన కనుసన్నలతో శాసించిన అనిల్ కుమార్, ఈ సంక్షోభ సమయంలో కార్పొరేటర్లను ఏకం చేయడంలో గానీ, మేయర్ రాజీనామాను అడ్డుకోవడంలో గానీ విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ (అనిల్ సొంత బాబాయ్ కుమారుడు) ఇన్చార్జి మేయర్‌గా బాధ్యతలు చేపట్టినా.. అనిల్ మద్దతు లేకుండా ఈ పదవిని నిలబెట్టుకోవడం కష్టమనే వాదన ఉంది.
నరసరావుపేట ఎఫెక్ట్.. సొంత గూటికి రాకలో చిక్కులు :
2024 ఎన్నికల్లో జగన్ ఆదేశాల మేరకు అనిల్ నెల్లూరు సిటీని వదిలి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత తిరిగి నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని ఆయన భావించినా, పరిస్థితులు అనుకూలించడం లేదు. నెల్లూరు సిటీ ఇన్చార్జి బాధ్యతలు అధికారికంగా అప్పగించడంలో వైసీపీ అధిష్టానం వెనుకాడుతోంది. అనిల్ నెల్లూరులో లేని సమయంలో స్థానిక క్యాడర్ ఇతర నాయకుల వైపు మొగ్గడం, లేదా టీడీపీలోకి వెళ్లడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది.
సొంత బాబాయ్ తిరుగుబాటు:
అనిల్ సొంత బాబాయ్ టీడీపీలో చేరడం ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించింది. వైసీపీలో కొందరు కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే తనను నెల్లూరు రాజకీయాలకు దూరం పెడుతున్నారని అనిల్ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. గతంలో తన అనుమతి లేనిదే ఫ్లెక్సీ కూడా కట్టలేని స్థాయిలో ఉన్న అనిల్, ఇప్పుడు తన మాట ఎవరూ పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు క్వార్ట్జ్ మైనింగ్ వంటి అక్రమ తవ్వకాల కేసుల్లో ఆయన పేరు వినిపించడం కూడా ఆయనను రక్షణలో పడేసింది. ఏదేమైనా నెల్లూరు వైసీపీలో ఫైర బ్రాండ్ గా ఓ వెలుగు వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారా లేక రాజకీయంగా మరికొంత కాలం సైలెన్స్ బాటలోనే ఉంటారా ? అనేది వేచి చూడాలి.