కేసీఆర్ కోసమే వాళ్లు వెయిటింగ్... రేవంత్‌పై సరికొత్త అస్త్రం... !
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో చురుగ్గా లేకపోవడంతో పార్టీ శ్రేణులు కొంత నిరుత్సాహంలో ఉన్నాయి. అయితే, కేసీఆర్ మళ్లీ ఫీల్డ్‌లోకి వస్తే కాంగ్రెస్ నాయకుల 'కుప్పిగంతులు' ఆగిపోతాయని, 'వార్ వన్ సైడ్' అవుతుందని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరచూ అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా త్వరలో 'టైగర్' వస్తుందని, అప్పుడు తోక జాడిస్తున్న వారంతా పారిపోతారని చెబుతూ వచ్చారు. అయితే, కేసీఆర్ ఎప్పుడు మళ్లీ ఫీల్డ్‌లోకి వస్తారన్నది మాత్రం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో, అనూహ్యంగా కేసీఆర్ ఎల్పీ (లెజిస్లేచర్ పార్టీ) మీటింగ్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు కేసీఆర్ రానున్నారు.
రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సరికొత్త అస్త్రం :
కేసీఆర్ ఈ ఎల్పీ మీటింగ్ అజెండాను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇది రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నీటి హక్కుల విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యం చుట్టూ తిరగనుంది. ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలకు తెలంగాణ హక్కులను ధారబోస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదే సమయంలో, బీఆర్ఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఎక్కడికక్కడ నిలిపివేయడం తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేయడమేనని కేసీఆర్ అంటున్నారు.
తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడానికి ముఖ్య అంశాలలో 'నీరు' ఒకటి. ఇప్పుడు కేసీఆర్ అదే ఆయుధంగా మళ్లీ రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. 'జల ఖడ్గాన్ని' అందుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి దిగబోతున్నారనేది స్పష్టమవుతోంది.
నాయకత్వంపై క్యాడర్ సందేహం :
ఎల్పీ మీటింగ్ ద్వారా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణను ఖరారు చేస్తారని పార్టీలో నమ్మకం ఉంది. అయితే, ఈ పోరాటానికి తాను ముందుండి నాయకత్వం వహిస్తారా, లేక కేవలం దిశానిర్దేశం చేస్తారా అన్నదే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఉన్న సందేహం. కేటీఆర్ సమర్థవంతంగా పార్టీని నడిపిస్తున్నప్పటికీ, కేసీఆర్ నాయకత్వం అంటే వచ్చే ఊపు వేరుగా ఉంటుందని, అలాంటి ఉత్సాహాన్ని ఇప్పుడు క్యాడర్ కోరుకుంటోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంతృప్తికరమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో, కేసీఆర్ నేరుగా గ్రౌండ్లోకి వస్తే మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు.
ఆరోగ్య సందేహాలకు పరోక్ష సమాధానం :
కేసీఆర్‌కు ఆరోగ్యం బాగోలేదనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ చర్చను పెంచడానికి రేవంత్ రెడ్డి వంటి నేతలు ప్రయత్నించినా, కేటీఆర్ స్పందించడం లేదు. కేటీఆర్ వ్యూహం ప్రకారం, కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ ద్వారానే తన ఆరోగ్యంపై ఉన్న అన్ని సందేహాలకు ఒకేసారి సమాధానం చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ ఖచ్చితంగా బయటకు వస్తారు. అది ఎప్పుడనేది మరియు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది డిసెంబర్ 19వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ మళ్లీ 'రెగ్యులర్ రాజకీయాలు' మొదలుపెడితే బీఆర్ఎస్ దూకుడు పెంచడం ఖాయం.