వైసీపీ కొత్త స్ట్రాటజీ! శైలజానాథ్‌కి కీలక బాధ్యతలు – టీడీపీకి భారీ సవాల్!

Amruth kumar
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి ఇప్పుడే రాజుకుంది. ఈ హీట్‌కు కారణం.. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ నేత సాకే శైలజానాథ్ వైఎస్సార్సీపీలోకి రావడం. 2024 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన ఆయనకు, శింగనమల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. ఈ సీనియర్ నేత రాకతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి.



అసలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న శైలజానాథ్:
శింగనమలలో ప్రస్తుతం అధికార టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉన్నారు. యువ నాయకురాలైన ఆమె ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈమెకు గట్టి పోటీని ఇస్తూ.. నియోజకవర్గంలో అసలైన ప్రతిపక్ష పాత్రను శైలజానాథ్ పోషిస్తున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం ఉన్నప్పటికీ, ఆయన తనదైన శైలిలో పొలిటికల్ బ్యాటింగ్‌ను మొదలుపెట్టారు.



తాజాగా, అరటి రైతుల సమస్యలపై శైలజానాథ్ చేపట్టిన నిరసన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అరటి గెలలను మెడలో వేసుకుని రైతులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోటాపోటీ రాజకీయం శింగనమలలో ముందే హై టెన్షన్ క్రియేట్ చేసింది.



గత తప్పిదం సరిదిద్దుకునే పనిలో వైసీపీ:
రాయలసీమలో వైసీపీకి గట్టి బలం ఉన్నప్పటికీ, అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ అనేక సీట్లు గెలుచుకుంది. శింగనమల వైసీపీ సిట్టింగ్ సీటు అయినప్పటికీ, 2024లో అభ్యర్థి ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా (సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని ట్రక్ డ్రైవర్‌ వీరాంజనేయులుకి టికెట్ ఇవ్వడం) ఓటమి చవిచూసింది. ఎన్నికల తర్వాత పార్టీని నడిపించడంలో కూడా ఇబ్బందులు తలెత్తడంతో, అనుభవం ఉన్న శైలజానాథ్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.



2029లో కేటగిరీ మారినా ఫైట్ రెడీ:
వచ్చే ఎన్నికల్లో శైలజానాథ్‌కు వైఎస్సార్సీపీ టికెట్ ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సీటు రిజర్వుడు (ఎస్సీ) నియోజకవర్గం అయినప్పటికీ, భవిష్యత్తులో పునర్విభజన జరిగితే ఇది జనరల్ కేటగిరీలోకి మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేటగిరీ ఏదైనా సరే.. శైలజానాథ్ తనదైన మార్క్‌ను చూపిస్తూ, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు శ్రావణికి ముందే గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. శింగనమలలో ప్రస్తుతం టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య జరుగుతున్న పోటాపోటీ చూస్తుంటే.. ఎన్నికలు రేపో మాపో అన్నట్టుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: