గత కొన్ని నెలలుగా ఎంతో ఉత్కంఠగా సాగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ముగిశాయి. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ లో పోటీ చేసినటువంటి మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడి చివరికి వారి భవిష్యత్తు ఏంటో తెలుసుకోగలిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి యువ నాయకుడు నవీన్ యాదవ్ బరిలో నిలిస్తే, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ విధంగా ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టి ప్రచారం చేశారు. దీనికి తోడు ముగ్గురు పార్టీలకు సంబంధించిన జాతీయ, రాష్ట్ర స్థాయి లీడర్లు కూడా ప్రచారంలో మునిగి తేలారు. ఎవరు ఎంత ప్రచారం చేసినా ఓటర్లు అనేవారు ఒక్కరిని మాత్రమే గెలిపించాలి.
ఆ విధంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకరిని మాత్రమే గెలుపు వరించింది. అది కూడా యువ నాయకుడు అయినటువంటి నవీన్ యాదవ్ 24,729 భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం లభించింది. అంతేకాదు హైదరాబాదులో కాంగ్రెస్ లేదని ఇన్నాళ్లు బాధపడినటువంటి క్యాడర్ కు సరికొత్త అవకాశం కూడా వచ్చింది. కంటోన్మెంట్ లో విజయం సాధించి హైదరాబాద్ పై పట్టు సాధించిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ విజయంతో మరింత పుంజుకోబోతోంది. అయితే నవీన్ యాదవ్ యువ నాయకుడు కాబట్టి ఆయనకు హైదరాబాద్ మీద ఎక్కువ పట్టు ఉంది.
అలాంటి ఈ తరుణంలో నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ నినాదం ఎత్తుతోంది. ఇదే సమయంలో బిసి మంత్రులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ కు యువ నాయకుల తరఫున కేబినెట్లోకి తీసుకుంటే హైదరాబాదులో పట్టు సాధించవచ్చు. అలాగే బీసీలకు మరో మంత్రి పదవి ఇచ్చామని చెప్పుకోవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. మరి నిజంగానే నవీన్ యాదవ్ కు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో బయటకు రానుంది.