పెద్దిరెడ్డి చూపు.. బీజేపీ వైపు.. షాకింగ్ డెసిషన్ ..!
అత్యంత రహస్యంగా.. చాలా గోప్యంగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చలు పెద్దిరెడ్డి వైసీపీని వీడతార న్న బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వంటివారే పార్టీ మారారు. పొరుగు పార్టీ నుంచి వచ్చినా.. పదవులు దక్కించుకున్న అవంతి శ్రీనివాసరావు, బీద మస్తాన్‌రావు వంటివారు కూడా.. జంప్ చేశారు. ఇక, పెద్దిరెడ్డి ఎంత? ఎవరికైనా రాజకీయాలే కావాల్సింది. ఎవరికైనా.. రాజకీయ మనగడే కావాల్సింది.
పైగా ఇప్పుడు రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. పోనీ అడుగు పెట్టినా.. తన మాట కానిస్టేబులే వినిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, వ్యాపారాలు దెబ్బతింటున్నా యి. ఒకప్పుడు మద్యం దుకాణాల నుంచి వచ్చే వాటాలు ఇప్పుడు రూపాయి కూడా రాకపోగా.. నిన్న మొన్నటి వరకు పెద్దిరెడ్డి వర్గంగా ఉన్నవారు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి.. కూటమి పార్టీలకు అనుకూలంగా మారారు. నియోజకవర్గంలోనూ రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇలాంటి సమయంలో తమను తాము కాపాడుకునేందుకు.. వ్యాపారాలను రక్షించుకునేందుకు.. కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు.. మార్పు దిశగా పెద్దిరెడ్డి అడుగులు వేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయనకు ఢిల్లీలో మంచి పలుకుబడి కూడా.. ఉంది. బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ పరిణామాలతో పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీ పంచన చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది కదా? అనే సందేహాలు వస్తాయి. అయినంత మాత్రాన చేరకూడదని చెప్పలేం కదా? అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.