నంద్యాల వాసులకు కుందూ భయం.. నది ఉధృతంగా ప్రవహిస్తే ఆ కాలనీలకు ఇబ్బందే!
పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీ వ్యర్థాలను ఈ నదిలో కలపడం వల్ల ఈ నది కలుషితం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నంద్యాల పట్టణ శివార్లలో కుందూ నది ప్రవహిస్తుంది. అయితే మద్దిలేరు వాగు నుంచి వచ్చే వరద వల్ల ఎస్సార్బీసీ కాలనీ వంతెన వద్ద కుందూ నదిలో కలవడం జరుగుతుంది. కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తే ఏకంగా 20 నుంచి 30 కాలనీలు నీట మునిగే అవకాశాలు అయితే ఉంటాయి.
100 కోట్ల రూపాయల వ్యయంతో కుందూ నది తీరం వెంబడి రక్షణ గోడను నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు చేసి టెండర్లు పిలిచి మధ్యలోనే వదిలేయడం జరిగింది. కర్నూలు మరియు కడప జిల్లాల్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలను ఈ నది కవర్ చేస్తుంది. 2009 సంవత్సరం వరదల సమయంలో నంద్యాలలో కుందూ నదీ ప్రవాహం వల్ల 5 రోజుల పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
కుందేరు నది అడుగున ఎక్కవ భాగం రాతిమయం కాగా ఇక్కడ సున్నపు రాళ్లను త్రవ్వి తీయడం ఎక్కువగా జరుగుతుంది. నది అడుగు శిలల పొరలతో ఉండటం వల్ల నీరు భూమిలోకి ఇంకక పోవడం ఈ నది ప్రత్యేకత కావడం గమనార్హం. తాజాగా కురిసిన వర్షాలకు సైతం కుందూ నది, మద్దిలేరు వాగులలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో జిల్లా పోలీస్ అధికారులు వరద ఉధృతిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురిస్తే కుందూ నదీ సమీపంలోని ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది.