ఏపీ బడ్జెట్ 2024 : పథకాలకు నిధులే బాబుకు అసలైన సవాల్.. జగన్ ను మించి సంక్షేమం చేస్తారా?

Reddy P Rajasekhar
కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ను ప్రకటించగా తెలంగాణతో పోల్చి చూస్తే కేంద్రం ఏపీకి ఒకింత ఎక్కువగానే ప్రాధాన్యత ఇచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి. ఏపీ ప్రభుత్వం గురువారం రోజున శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బడ్జెట్ నేపథ్యంలో తమ ప్రతిపాదనలను బుధవారం సాయంత్రంలోగా పంపాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారని భోగట్టా. మరోవైపు ఏపీ ప్రభుత్వం పింఛన్ల పెంపు విషయంలో ప్రజల మెప్పు పొందినా ఉచిత ఇసుక స్కీమ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నిరోజులుగా కురిసిన వర్షాల వల్ల ప్రస్తుతం ఇసుక అందుబాటులో లేదు.
 
మరోవైపు తల్లికి వందనం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు 1500 రూపాయలు, అన్నదాత సుఖీభవ, ఇతర కీలక పథకాల అమలు ఎప్పుడంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా పథకాలను అమలు చేసినా సమస్య లేదని ఆ పథకాలను ఎప్పటినుంచి అమలు చేస్తారో వెల్లడిస్తే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పథకాల అమలు ఆలస్యమైతే ప్రజలు అసహనానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి.
 
జగన్ ను మించి సంక్షేమం అమలు చేస్తామని చంద్రబాబు చెబుతున్నా ఆచరణలో అది సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. 164 స్థానాల్లో విజయంతో అధికారంలోఒకి వచ్చిన కూటమి ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నిరుపేదల నుంచి ధనవంతుల వరకు అందరి మెప్పు పొందాల్సి ఉంది. ఈ విషయంలో చంద్రబాబు పాలనకు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి. మరోవైపు చంద్రబాబు కృషి వల్లే బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయని చెప్పవచ్చు. కేంద్ర పెద్దల్ని ఒప్పించి, మెప్పించి చంద్రబాబు సాధించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యం పాటించేలా కేటాయింపులు జరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: