ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు గడిచింది. ఇదే తరుణంలో గత ప్రభుత్వంలో అమలు అయినటువంటి జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజపత్రాన్ని అప్లోడ్ చేసింది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలంతా మండిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రాజపత్రం అప్లోడ్ చేయడం ఏంటని అడుగుతున్నాయి. ఇదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వమేమో జగన్మోహన్ రెడ్డి ఇది అమలు చేసేశారు అంటూ ఆయన పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మరి జగన్ తప్పు చేస్తే ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తప్పును ఫాలో ఎందుకు అవుతున్నారు, దాన్ని ఆపివేయచ్చు కదా, మరో విధానాన్ని తీసుకురావచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను గ్యారంటీ పెన్షన్ స్కీం (జిపిఎస్) లోకి తీసుకొస్తూ కూటమి సర్కార్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది 2023 అక్టోబర్ అమల్లోకి వస్తుందని తెలియజేసింది. ఈ జిపిఎస్ విధానాన్ని జూన్ 12వ తేదీన జీవో 54ను సర్కారు విడుదల చేసింది. కానీ ఆ సమయంలో రాజపత్రం విడుదల చేయలేదు. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం జగన్ తీసుకువచ్చినటువంటి జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ రాజపత్రం విడుదల చేసింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సీపీఎస్ రద్దు పైన, ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసినటువంటి జీపీఎస్ స్కీం, అమలు చేసింది.
దీంతో ఇది సీపీఎస్ కంటే చాలా నష్టమని దీనిని వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులంతా ఆందోళన బాట పట్టారు. దీంతో స్పందించినటువంటి టిడిపి కూటమి జీపీఎస్ అమలు విధానంపై మా నిర్ణయం ఏం లేదని, అప్పటి ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకాలు చేశారు. ఆయన సెలవుల మీద వెళ్తూ అన్ని దస్త్రాలపై సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. ఇందులో జీపీఎస్ దస్త్రం కూడా ఉందని, అయితే అప్పుడే అమలైనటువంటి ఈ జీపీఎస్ విధానానికి సంబంధించి పత్రాన్ని జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం అప్లోడ్ చేసింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ ఆందోళనకు దిగాయి. హామీని తుంగలో తొక్కుతూ మాకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం జగన్ చేసిన తప్పంటూ నెట్టివేస్తున్నాయి. కానీ అసలు విషయంలోకి వెళ్తే జగన్ తప్పు చేశాడు మరి ఈ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి పత్రాన్ని విడుదల కాకుండా రద్దు చేయొచ్చు కదా అది ఆయన చేతుల్లోనే ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు.