తల్లులా.. పిల్లలా .... చంద్రబాబుకు బిగ్ సవాల్ ..!
ఇంతలోనే దీనికి సంబంధించి ఒక జీవో విడుదల చేశారు. ఆధార్ కార్డును సిద్ధం చేసుకోవాలని, ఆధార్ కార్డు లేని వారు ఆధార్ కార్డు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 విడుదల చేసింది. ఇందులో తల్లులు అని పేర్కొంది. ఆధారి కార్డు లేని తల్లులు ఆధార్ కార్డును సిద్ధం చేసుకోవాలని లేదా రేషన్ కార్డును సిద్ధం చేసుకోవాలని, ఫోటో గుర్తింపు కార్డు ఉన్న పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ఇది పెను విభాగంగా మారింది. అంటే ఈ పథకాన్ని పిల్లలకు ఇస్తారా తల్లులకు ఇస్తారా అనే చర్చ తెర మీదకు వచ్చింది. ముఖ్యంగా వైసిపి దీన్ని రాజకీయం చేయడంలో చాలా దూసుకుపోయింది.
క్షేత్రస్థాయిలో ఇద్దరు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ఇచ్చిన కారణంగానే పేద విద్యార్థులు చదువుకున్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. అదే విధంగా అమర్నాథ్ కూడా చెప్పుకొచ్చారు. కానీ తాజాగా చంద్రబాబు ఎన్నికల ముందు ఎంత మంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం తల్లులు అని పేర్కొంటూ జీవో ఇచ్చారని అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంతమందికి ఇస్తానని చెప్పిన మాట బూటకమని మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు.
వాస్తవానికి ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పథకంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? అనే విషయంపై చంద్రబాబు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇంతలో ఆధార కార్డును సిద్ధం చేసుకోవాలంటూ జీవో 29 విడుదల చేశారు. దీనిలో తల్లులు అని పేర్కొన్నంత మాత్రాన అందరికీ ఇవ్వరు అనే ఉద్దేశం అయితే ప్రభుత్వం దగ్గర లేదు.
కానీ, దీనికి సంబంధించి ఒక నిధుల సమస్య ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అమలు చేయాలని విషయంపై మాత్రం ఆలోచనలో పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్న తల్లులు కూడా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇద్దరి నుంచి ముగ్గురు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకరు ఉన్నవారు కూడా ఉన్నారు. ఎట్లా చూసుకున్నా ప్రతి కుటుంబానికీ ఇవ్వాలా లేదా రేషన్ కార్డు ఆధారంగా చేసుకుని వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్లకే ఇవ్వాలా అనే విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పరిశీలిస్తోంది.
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కరెంటు మీటర్ రీడింగ్ ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేసిన విషయం గమనార్హం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రీడింగ్ 300 యూనిట్లు మించని ప్రతి కుటుంబాల్లోని పిల్లలకి ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నారా? అనే విషయంతో సంబంధం లేకుండానే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు దీన్నే మాజీమంత్రులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగా కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయరని, ఈ పథకంలో భారీ కోతలు పెడతారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ చెప్పుకు రావడం గమనార్హం. దీనిని బట్టి తల్లులా? పిల్లలాఝ అనే విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
లేకపోతే ఇది బలపడితే పథకం ఎప్పుడు అమలు చేశారనేది పక్కనపెడితే అమలు చేసిన తర్వాత ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదనే నేపథ్యం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ పథకాన్ని ఒక ఏడాది వాయిదా వేసినా, లేక ఆరుమాసాలు వాయిదా వేయటమా? అనేది కూడా స్పష్టత ఇవ్వాలి. చిత్రం ఏంటంటే నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లో ఇటీవల కాలంలో అమ్మకు వందనం పథకం మీదే ఎక్కువ మంది మహిళలు అర్జీలు సమర్పిస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.