ఈ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ని లేపడానికి ఎందుకంత కష్టపడుతున్నారు?
ఇక ఏపీ విషయానికొస్తే వైసీపీ వల్లనే కాంగ్రెస్ దెబ్బ తిన్నది అని ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు. 2011 నుంచి ఏపీలో కాంగ్రెస్ కి చీకటి రోజులు మొదలయ్యాయి. అవి అలా కంటిన్యూ అవుతూ ఒక పుష్కర కాలం దాకా వెంటాడాయి. ఈ నేపథ్యంలో ఇపుడు కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. అవును, ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెతను విశ్వసిస్తోంది. అందువల్లనే వైఎస్సార్ ఫ్యామిలీ నుంచే షర్మిలను తెచ్చి అన్న జగన్ కి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసి నిరూపించింది కూడా. ఇదే అదనుగా కాంగ్రెస్ వైసీపీని మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలని ప్లాన్ చేస్తోంది. విషయం ఏమిటంటే... వైఎస్సార్ 75వ జయంతిని విజయవాడలో పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్ తమ వాడే, ఆయన 2004 నుంచి 2009 దాకా పాలించిన పాలనను సంక్షేమ రాజ్యాన్ని తెచ్చే సత్తా తమకే ఉందని చెప్పుకోవాలని యోచిస్తోంది.
మరోవైపు ఈమధ్య మన ఇరు తెలుగు రాష్ట్రాల మంత్రులు కలుసుకొని చెట్టాపట్టాలేసుకొని తిరగడం అందరికీ తెలిసిందే. టీడీపీ కి చెందిన బాబు కాంగ్రెస్ కి చెందిన రేవంత్ రెడ్డిని కలవడంలో ఏదో మతలబు ఉందని, అదంతా కాంగ్రెస్ ప్లాన్ అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు కీలక నేతలకే ఏపీలో కాంగ్రెస్ ని లేపే బాధ్యతలు తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రానున్న రోజులలో కాంగ్రెస్ ఏపీలో మరింతగా దూకుడు చేస్తుందని అంటున్నారు. దానికి నాందిగా వైఎస్సార్ జయంతి వేడుకలను వేదిక చేసుకోనున్నారు అని అంటున్నారు.