అలుసైపోయాం.. అందుకే ఓడిపోయామంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Suma Kallamadi
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. 151 అసెంబ్లీ సీట్ల నుంచి ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పడిపోయింది. ఇక గతంలో 22 ఎంపీ సీట్లను గెలుచుకున్న ఆ పార్టీ కేవలం ఈ సారి 4 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వైసీపీకి పీడకలగా మారిపోయాయి. మొదట్లో ఎన్నికల ఫలితాలపై వైసీపీకి ఏం స్పందించాలో పాలుపోలేదు. అయితే ఎన్నికల ఫలితాలపై వైసీపీ నుంచి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మొదట్లో ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని వారు అంచనా వేయలేదు. ఇక ఫలితాలు వెలువడ్డాక ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందని వైసీపీ గగ్గోలు పెట్టింది. అయితే కూటమిగా మూడు పార్టీలు రావడం వల్ల వైసీపీకి ఓటమి ఎదురైందని మరికొందరు నేతలు పేర్కొన్నారు. ఈ తరుణంలో ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి మేము అలుసైపోయామంటూ వ్యాఖ్యానించారు. అదే తమ కొంప ముంచిందని, తమ ఓటమికి కారణమైందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తరచూ ప్రజల్లో ఉండే వారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే వారు. అయితే ఓటమి ఆయనలో నైరాశ్యం నింపింది. ప్రజలు అడగని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, అందుకే తాము అలుసైపోయామని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఎక్కడైనా ఏదైనా పని అవ్వాలంటే ప్రజలు ఎమ్మెల్యే చుట్టూ 10 రోజులు తిరుగుతారని, ఆ తర్వాత 20 రోజులు గడిచాక ఆ ఎమ్మెల్యే పనులు చేస్తాడని చెప్పారు. ఇలా కాకుండా తానే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించానని గుర్తు చేసుకున్నారు. ఇలా రోజూ ప్రజల వద్దకు వెళ్లడంతో వారికి చులకన అయిపోయానేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వైసీపీ నేతలు తమ ఓటమికి లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ, చంద్రబాబు అరెస్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్టవ్ వంటి కారణాలుగా పేర్కొన్నారు. అయితే కేతిరెడ్డి మాత్రం తన ఓటమి తానే కారణమని, ఎక్కువ రోజులు ప్రజలతో ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతూ బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: