శ్వేత‌ప‌త్రాల‌తో చంద్ర‌బాబుకే ఎదురు దెబ్బా.. ఈ లాజిక్ తెలుసా బాబు గారు..?

RAMAKRISHNA S.S.
ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన కూట‌మి ప్ర‌భుత్వం దూకుడు గా ముందుకు సాగుతోంది. తాము చేయాల్సింది ప‌క్క‌న పెట్టి.. గ‌త స‌ర్కారు చేసిన త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ముందుకు వ‌చ్చింది. ఇది ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఇటీవ‌ల కాలంలో చేస్తున్న కార్య‌క్ర‌మ‌మే. ముందుగానే తాము రంగంలోకి దిగిపోతే.. గ‌త ప్ర‌భుత్వంతో కంపేర్ చేసేందుకు స‌మ‌యం స‌రిపోదు కాబ‌ట్టి.. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వాలు.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వాలు చేసిన త‌ప్పుల‌ను శ్వేత ప‌త్రాల రూపంలో విడుద‌ల చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా.. ఏడు కీల‌క శాఖ‌ల‌కు చెందిన అంశాల‌పై గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు.. ఇత‌ర అంశాల‌తో కూడిన శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేస్తోంది. ఇప్ప‌టికే పోల‌వ‌రంపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేసిన సీఎం చంద్ర‌బాబు.. దీనిని ఇప్పట్లో క‌ట్ట‌డం సాధ్యం కాద‌ని తేల్చేశారు. దీనిని వైసీపీ నాశ‌నం చేసింద‌న్నారు. అంతేకాదు.. రివ‌ర్స్ టెండ‌ర్ల ద్వారా.. వ్య‌యాన్ని పెంచేశార‌ని.. కేంద్రాన్ని కూడా లెక్క‌చేయ‌లేద‌న్నారు.

ఇవి పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉంటుంది. కానీ.. చంద్ర‌బాబు వ‌చ్చారు. పోల‌వ‌రం ప‌రుగులు పెడు తుంద‌ని ఆశించిన ప్ర‌జ‌ల‌ను, పారిశ్రామిక వేత్త‌ల‌ను కూడా.. ఆలోచ‌న‌లో ప‌డేసింది. శ్వేత ప‌త్రం వ‌ల్ల  వ‌చ్చిన మైలేజీ కంటేకూడా.. ఇప్పుడు బాబుకు.. ఇబ్బందులు పెరిగాయి. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. అమ‌రావ‌తిపైనా శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తున్నారు. ఇక్క‌డ ధ్వంసం జ‌రిగింద‌ని చెప్ప‌నున్నారు. అయితే.. ఈ విష‌యంలో కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. ఇప్పుడిప్పుడే.. చంద్ర‌బాబు ను చూసి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు క‌నుక అమ‌రావ‌తి లోటుపాట్ల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిస్తే.. పెట్టుబ‌డి దారులు వెన‌క్కి వెళ్లే ప్ర‌మాదం ఉంది. తెలంగాణ‌లోనూ ఇదే జ‌రిగింది. అక్క‌డ ఆర్థిక శాఖ‌కు చెందిన శ్వేత ప‌త్రాన్ని విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. అప్ప‌టి వ‌ర‌కు రెడీగా ఉన్న పెట్టుబ‌డి దారులు.. వెన‌క్కి వెళ్లిపోయారు. ఇదే విష‌యాన్ని కొంద‌రు మంత్రులు కూడా.. న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో త‌ర్వాత కాలంలో శ్వేత ప‌త్రాల విష‌యాన్ని ప‌క్క‌న పెట్టారు. సో.. ఈ అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: