ప్ర‌త్యేక హోదా.. ప్ర‌త్యేక బాధ‌: అస‌లేంటీ ప్ర‌త్యేక హోదా? ఎప్పుడు.. ఎలా పుట్టింది..?

RAMAKRISHNA S.S.
- 1961లో తొలి ఆర్థిక‌సంఘం సిఫార్సులతో పుట్టిన ప్ర‌త్యేక హోదా
- కేంద్రానికి క‌ట్టే ప‌న్నులు 10 % కే ప‌రిమితం
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ప్ర‌త్యేక హోదా.. ఈ మాట అంద‌రూ అంటూనే ఉన్నారు. అంద‌రూ వింటూనే ఉన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని చెబుతూనే ఉన్నారు. అయితే.. అస‌లు ఈ ప్ర‌త్యేక హోదా ఏంటి?  ఎలా ఇస్తారు?  ఎప్పుడు ఇస్తారు? అనే విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. ఏదో ప్ర‌త్యేక హోదా అంటే.. ఇదేదో బ్ర‌హ్మ ప‌దార్థ‌మ‌ని.. దీనివ‌ల్ల ఏదో వ‌స్తుంద‌ని అనుకుంటారు. కానీ, వాస్త‌వం ఏంటంటే.. ప్ర‌త్యేక హోదా ఇచ్చినా.. ఉన్నా.. దీనిని వినియోగించుకునే తీరును బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ క్ర‌మంలో అస‌లు.. ప్ర‌త్యేక హోదా పుట్టుపూర్వోత్త‌రాలు ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

దేశంలో తొలి ప్ర‌ధాని నెహ్రూ కాలంలో రాష్ట్రాల అభివృద్ధి కోసం.. నిర్దేశించిన ప్ర‌ణాళిక సంఘం ఆయా రాష్ట్రాల ప‌నితీరును, ఆదా య వ‌న‌రుల‌ను.. లెక్కించి.. ఏయే రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉంది?  ఏయే ప్ర‌ణాళిక‌ల ప్ర‌కారం దేశాన్ని ముందుకు న‌డిపిం చాల‌నే విష‌యాల‌పై దిశానిర్దేశం చేసింది. ఇలా 1951లో ఏర్ప‌డిన ప్ర‌ణాళికా సంఘం.. త‌ర్వాత‌.. ఏర్ప‌డిన ఆర్థిక సంఘాలు కూడా.. రాష్ట్రాల తీరుతెన్నుల‌ను బ‌ట్టి.. ఆదాయ పంపిణీ, వ‌నరుల వినియోగాన్ని లెక్క‌గ‌ట్టాయి. ఇప్పుడు కేంద్రీకృతంగా ఈ విధానం ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇలా.. 1961లో తొలి ఆర్థిక సంఘం.. రాష్ట్రాల అభివృద్ధికి కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసింది. అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు.. అధ్య‌య‌నం చేసిన ఆర్థిక సంఘం .. రాష్ట్రాల భిన్న‌మైన ప‌రిస్థితుల‌ను వివ‌రించింది. మైదాన ప్రాంతాలుగా ఉన్న రాష్ట్రాల‌కు, కొండ‌లు, గుట్ట‌ల‌తో ఉన్న రాష్ట్రాల‌కు వ్య‌త్యాసం చూపించింది. అదేవిధంగా స్వ‌ల్ప ఆదాయం ఉన్న రాష్ట్రాలు, అధికాదాయం ఉన్న రాష్ట్రాలుగా విభ‌జించింది. ఈ క్ర‌మంలోనే కొండ‌లు.. గుట్టలు.. విదేశాల‌తో స‌రిహ‌ద్దులు పంచుకునే రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధిలో వెనుక‌బ‌డిన‌ట్టు గుర్తించింది. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించింది.

ఈ రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ వంటివి ఉన్నారు. వీటితోపాటు. జ‌మ్ము క‌శ్మీర్ కూడా అప్ప‌ట్లో ఉంది. ఈ హోదా ఇచ్చేందుకు రాజ్యాంగంలో ఏమీ ప్రొవిజ‌న్ లేదు. ఇది కేవలం పార్ల‌మెంటు చేసే చ‌ట్టం లేదా.. నిర్ణ‌యాన్ని బ‌ట్టి అమ‌లు చేసుకుంటారు. త‌ద్వారా.. హోదా ప్ర‌క‌టించిన రాష్ట్రాల‌కు క‌నిష్ఠంగా ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు.. కేంద్రం అమ‌లు చేసే ప‌థ‌కాల్లో రాష్ట్రాల వాటాను 10 శాతానికి ప‌రిమితం చేస్తారు. అదేవిదంగా కేంద్రానికి క‌ట్టే ప‌న్నుల‌ను కూడా గ‌రిష్ఠంగా 10 శాతానికి ప‌రిమితం చేస్తారు.

దీని వ‌ల్ల నూత‌న ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌లు ఏర్పాటు చేసుకునేవారికి ఐదేళ్ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా ఆయా రాష్ట్రాల  ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. ఇక్క‌డ ప‌న్నులు తీసుకునేది రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే . కేంద్రం కాదు. దీంతో ప‌న్నులు వ‌సూలు చేసినా.. రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంది. అందుకే ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్ పెరిగింది. కానీ,తొలి ఆర్థిక సంఘం మాత్రం అన్ని రాష్ట్రాల‌కు ఇవ్వాల‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: