టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దే రామోహ‌న్ భార్య‌కు భువ‌నేశ్వ‌రి అభ‌యం.. ఆ పద‌వి ఫిక్స్ అయ్యిందా..?

RAMAKRISHNA S.S.
ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఐదేళ్లలో చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఖచ్చితంగా వస్తుందన్న ఆశలతో పనిచేశారు. ఈ క్రమంలోనే కీలకమైన ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు నుంచి పార్టీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019, 2024 ఎన్నికలలో వరుసగా విజయవాడ తూర్పు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రికార్డు సృష్టించారు.

2019 ఎన్నికలలో కృష్ణా జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ గన్నవరం, విజయవాడ తూర్పు రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. గన్నవరం నుంచి గెలిచిన వంశీ పార్టీకి దూరమైపోయారు. అయితే గత నాలుగేళ్లలో జిల్లా మొత్తం మీద ఏకైక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా.. గద్దె పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఇప్పటికే ఒకసారి విజయవాడ ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దెకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణలు అనుకూలించలేదు.

ఇక గద్దె భార్య అనురాధ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్‌గా పని చేశారు. ఐదేళ్లలో ఆమె పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఈసారి ఆమె ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవిపై కన్నేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పదవిలో హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. ఆమె త్వరలోనే ఈ పదవికి రాజీనామా చేయనున్నారు. కీలకమైన ఈ పదవి కోసం గద్దె అనురాధ లాబీయింగ్‌ మొదలు పెట్టేసారని.. ఎప్పటికే నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సైతం ఈ పదవిపై అనురాధకు హామీ ఇచ్చినట్టు గద్దె వర్గీయులు చర్చించుకుంటున్నారు. మరి అనురాధకు ఈ పదవి వస్తుందా..? రాదా..? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: