నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఏ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు!

Reddy P Rajasekhar
మారుతున్న కాలనికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెర లేవడం గమనార్హం. బ్రిటిష్ వలస పాలన నుంచి మన దేశంలో కొనసాగుతున్న ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయని తెలుస్తోంది. గతేడాది పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు ఇకపై అమలు కానున్నాయి.
 
ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ అమలులోకి వచ్చాయని సమాచారం అందుతోంది. జీరో ఎఫ్.ఐ.ఆర్, స్టేషన్ కు వెళ్లకుండా ఆన్ లైన్ లో ఫిర్యాదు నమోదు, ఎస్.ఎం.ఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి కొత్త చట్టాలు న్యాయ వ్యవస్థలోకి రావడం గమనార్హం. తాము న్యాయానికి పెద్ద పీట వేశామని అమిత్ షా కొత్త చట్టాల గురించి చెప్పుకొచ్చారు.
 
భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారని దీంతో ఇక వలసపాలన నాటి నేర న్యాయ చట్టాలు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు అంతా భారతీయమేనని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు విచారణ పూర్తైన 45 రోజుల్లో తీర్పు వెలువడాలి. ప్రాథమిక విచారణ జరిగిన 60 రోజులలో అభియోగాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
 
ఈ కొత్త చట్టాలలో రాజద్రోహం అనే పదాన్ని తొలగించడం గమనార్హం. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష వేసేలా చట్టాల్లో మార్పులు చేశారు. కొత్త చట్టాలలో సెక్షన్ల సంఖ్యను 358కు కుదించారు. తీవ్రమైన నేరాలలో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడం కొత్త చట్టాలలో తప్పనిసరి చేశారు.  కొత్త చట్టాల ప్రకారం ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: