వైసీపీకి అసెంబ్లీలో ఆ ప‌ద‌వి కూడా లేన‌ట్టే... బాబు ఇవ్వ‌రా...!

RAMAKRISHNA S.S.
ప్ర‌జా ప‌ద్ద‌లు క‌మిటీ చైర్మ‌న్‌. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వాలకు అత్యంత కీల‌క మైన ప‌ద‌వి. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు.. వ‌స్తున్న ఆదాయానికి సంబంధించి.. ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు వేసి. అసెంబ్లీకి స‌మ‌ర్పించే గురుత‌ర బాధ్య‌త‌ను పీఏసీ క‌మిటీ తీసుకుంటుంది. దీనికి కేబినెట్ హోదా క‌ల్పిస్తారు. అదేవిధంగా ఈ క‌మిటీలోని స‌భ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు కూడా ప్ర‌త్యేక వెసులు బాటు ఉంటుంది. దీనికి అయ్యే బ‌డ్జెట్‌ను కూడా.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేకంగా కేటాయిస్తాయి.

పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని ప్ర‌తిప‌క్షంలోని ఎమ్మెల్యేకు అప్ప‌గించ‌డం ఆన‌వాయితీ. అలానే చేయాలి కూడా. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు హ‌యాంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి పీఏసీక‌మిటీకి చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఆయ‌న త‌ర్వాత‌.. టీడీపీ ప్ర‌తిప‌క్షంలోకి రాగానే.. ఈ ప‌ద‌విని ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప్ర‌స్తుత మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌కు అప్ప‌గించారు. ఇద్ద‌రూ కూడా బాగానే ప‌నిచేశారు. ప్ర‌భుత్వాల ఖ‌ర్చుల‌ను క‌నిపెట్టి నివేదిక‌లు ఇచ్చారు.

అయితే..ఇప్పుడు ఈ ప‌ద‌విని ఎవ‌రికి ఇస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాని కి మాత్ర‌మే ఈ ప‌దవి వ‌రిస్తుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వైసీపీ హోదా ద‌క్కించుకోలేక పోయింది. 175 మంది ఎమ్మెల్యేల్లో 15 శాతం ఉన్న పార్టీకి మాత్రమే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా వ‌స్తుంది. లేక‌పోతే హోదా రాదు. ఈ ర‌కంగా చూసుకుంటే.. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ద‌క్కారు. అంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కించుకునేందుకు కోరం లేకుండా పోయింది.

పైగా.. అస‌లు 11 మంది కూడా.. స‌భ‌కు వ‌స్తార‌నే గ్యారెంటీ కూడా లేదు. కేవ‌లం ప్ర‌మాణ స్వీకారంతోనే స‌రిపుచ్చి.. త‌ర్వాత‌.. ఇంటికే ప‌రిమిత‌మ య్యే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. అస‌లు ప్ర‌తిప‌క్షం కూడా.. స‌భ‌లో ఉండ‌దు. దీంతో పీఏసీ అనే మాటే వినిపించే ప‌రిస్థితి లేకుండా పోయే అవ‌కాశం ఉంది. అలాగ‌ని అధికార ప‌క్ష‌మే దీనిని తీసుకుంటుందా?  అంటే.. దానికి ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలో వెసులు బాటు లేదు. సో.. ఎలా చూసుకున్నా.. ఈసారి పీఏసీ ఉండ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: