టీజీ భరత్ పైనే కర్నూలు వాసుల ఆశలు.. సమస్యలు ప్రస్తావించి అసెంబ్లీలో హీరో అవుతారా?

Reddy P Rajasekhar
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీజీ భరత్ విజయం సాధిస్తారని చాలామంది భావించగా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ ఎమ్మెల్యేగా గెలిచారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తన వాగ్ధాటితో ఓటర్ల మనస్సు గెలుచుకోవడం ద్వారా సునాయాసంగా టీజీ భరత్ ఎమ్మెల్యే అయ్యారు. కర్నూలులో ఇప్పటికే టీజీ భరత్ కుటుంబానికి పరిశ్రమలు ఉన్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు.
 
కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తానని, కర్నూలును శరవేగంగా అభివృద్ధి చేస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడానికి తన వంతు ప్రయత్నిస్తానని టీజీ భరత్ హామీలు ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ హామీలను నెరవేర్చి టీజీ భరత్ రియల్ హీరో అవ్వాలంటూ కర్నూలు వాసులు కామెంట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు రాష్ట్రంలో ఎంతో మంచి పేరు ఉన్నా ఇక్కడ ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు.
 
చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ లేవు. జిల్లావాసులు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ లేదా బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితులే తప్ప కర్నూలులో 10,000 రూపాయలకు మించి వేతనం ఇచ్చే ఉద్యోగాలు మాత్రం ఎక్కువ సంఖ్యలో లేకపోవడం గమనార్హం. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
ఆ రీజన్ వల్లే ఈ ఎన్నికల్లో వైసీపీ ఇంతియాజ్ కు టికెట్ ఇవ్వగా ఆయన నాన్ లోకల్ కావడంతో కర్నూలు ఓటర్లు టీజీ భరత్ కే ఛాన్స్ ఇచ్చారు. యూకేలో ఎంబీఏ చేసిన టీజీ భరత్ కు కర్నూలు వాసుల సమస్యల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ఆ సమస్యలను భరత్ అసెంబ్లీలో ప్రస్తావించాలని కర్నూలు వాసులు ఫీలవుతున్నారు. ఎన్నికల్లో తొలిసారి గెలిచిన టీజీ భరత్ అసెంబ్లీలో కర్నూలు వాసుల సమస్యల గురించి మాట్లాడి రియల్ హీరో అనిపించుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: