30 ఏళ్ల అనుభవం ఉన్నా తొలిసారి మంత్రి .. పయ్యావుల ఆ విషయంలో చాలా లక్కీ!

Reddy P Rajasekhar
ఏపీ రాజకీయాల్లో ఉరవకొండ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని 2019 ఎన్నికల వరకు ప్రూవ్ అయింది. ఈ కారణం వల్లే పయ్యావుల కేశవ్ కు గతంలో మంత్రి పదవి దక్కలేదు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాకపోవడం పయ్యావులకు మైనస్ అయింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో పయ్యావుల కేశవ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది.
 
30 సంవత్సరాల క్రితం పయ్యావుల కేశవ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో 1994 సంవత్సరంలో ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆ ఎన్నికల్లో గెలుపుతో పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1994, 2004, 2009, 2019 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ ఈ ఎన్నికల్లో కూడా గెలిచి ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు.
 
2019 ఎన్నికల సమయంలో రాష్ట్రమంతటా వైసీపీ హవా ఉన్నా పయ్యావుల మాత్రం ఉరవకొండ నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా, టీడీపీ అధినేత ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా కూడా పయ్యావుల కేశవ్ పని చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పయ్యావుల ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి న్యాయం చేస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
 
చంద్రబాబు నాయుడు ఏ శాఖ ఇచ్చినా ఆ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని ఆయన చెబుతున్నారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా, సబ్జెక్ట్ తో మాటలు తూటాలు పేల్చగల నేతగా పయ్యావుల కేశవ్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ 30 ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితం మంత్రి పదవి రూపంలో దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉరవకొండ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన పయ్యావుల మంత్రిగా కూడా ఏపీ ప్రజల మెప్పు పొందుతారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభిమానులు పయ్యావుల కేశవ్ ను అభిమానంతో అసెంబ్లీ టైగర్ అని పిలుస్తారు. ఈ ఎన్నికల ఫలితాలతో 1994 తర్వాత ఉరవకొండ నియోజకవర్గంకు సంబంధించి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: