బాబు కేబినెట్లో బీసీ మంత్రులు: అన‌గాని, అచ్చెన్న‌, అయ్య‌న్న‌, ప‌ల్లా, కందికుంట‌...?

RAMAKRISHNA S.S.
- ఈ సారి కేబినెట్లో బీసీల‌కు ఫుల్ ప్ర‌యార్టీ
- సీనియ‌ర్ల‌తో పాటు అన‌గాని, కందికుంట, ప‌ల్లా లాంటి కొత్త ముఖాలు
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
ఇటు ఎమ్మెల్యేల్లో, అటు ఎంపీల్లో ఏపీలో కూట‌మి అభ్య‌ర్థులు తిరుగులేని విజ‌యం సాధించారు. ఇది మామూలు విజ‌యం కాదు. మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేయ‌డంతో ఈ సారి ప‌ద‌వుల విష‌యంలో పోటీ తీవ్రంగానే ఉండ‌నుంది. ఈ రోజు కేంద్ర కేబినెట్లో ఏపీకి మొత్తం మూడు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక ఏపీలో ఏర్ప‌డే కూట‌మి ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు ఎవ‌రెవ‌రికి మంత్రి ప‌ద‌వులు కేటాయించాల‌నే అంశంమీద క‌స‌ర‌త్తులు చేసి ఓ కొలిక్కి తీసుకు వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇప్ప‌టికే 15 - 18 మంది మంత్రుల విష‌యంలో బాబు పూర్తి క్లారిటీతో ఉన్నార‌ని.. ఓ ఆరేడు మంది మంత్రుల విష‌యంలో మాత్రం స‌స్పెన్స్ కంటిన్యూ అవుతోంద‌ని తెలిసింది. అటు జ‌న‌సేన వాళ్ల‌కు, బీజేపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంతో పాటు ఇటు టీడీపీలో సీనియ‌ర్ల‌కు బెర్త్‌లు కేటాయించ‌డం.. బీసీ ఈక్వేష‌న్లు బ్యాలెన్స్ చేయ‌డం.. ప్రాంతీయ స‌మీక‌ర‌ణ‌లతో కూర్పు క‌త్తిమీద సామే అంటున్నారు.

ఈ సారి బీసీల్లో ప్ర‌భావం చూపే అన్నీ కులాల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చేలా చంద్ర‌బాబు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. బీసీల్లో యాద‌వ‌, గౌడ‌, ప‌ద్మ‌శాలి, కొప్పుల వెల‌మ‌, కాళింగ‌, తూర్పు కాపుల‌కు ప్రాధాన్య‌త ఉండ‌నుంది. యాద‌వ వ‌ర్గం నుంచి ఈ సారి పోటీ ఎక్కువే. య‌న‌మ‌ల‌తో పాటు కొలుసు పార్థ‌సార‌థి, ప‌ల్లా శ్రీనివాస‌రావు రేసులో ఉన్నారు. గౌడ కోటాలో రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ గౌడ్‌కు ప‌క్కా బెర్త్‌. కొప్పుల వెల‌మ‌ల నుంచి అయ్య‌న్న‌పాత్రుడు, అచ్చెన్నాయుడు ఉండ‌నే ఉన్నారు.

కాళింగ‌ల నుంచి కూన ర‌వికుమార్‌, తూర్పు కాపుల నుంచి క‌ళా వెంక‌ట్రావుకు బెర్త్‌లు దాదాపు ఖ‌రారైన‌ట్టే. ఇక ప‌ద్మ‌శాలీ చేనేత కులాల నుంచి కందికుంట వెంక‌ట‌ప్ర‌సాద్‌కు బెర్త్ గ్యారెంటీ అంటున్నారు. ఈ వ‌ర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావ‌డంతో పాటు పార్టీలో సీనియ‌ర్ నేత కావ‌డం.. రాయ‌ల‌సీమ జిల్లాలు.. అందులోనూ చేనేత‌లు ఎక్కువుగా ఉన్న అనంత‌పురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావ‌డంతో ఆయ‌న‌కు అన్నీ స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి వ‌స్తున్నాయి. ఏదేమైనా ఈ సారి బీసీల్లో అన్నీ ప్ర‌ముఖ కులాల‌తో పాటు ప్రాంతాల వారీగా కూడా బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్ కూర్పు ఉండ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: