బంప‌ర్ మెజార్టీతో గెలిచినా టీడీపీ లీడ‌ర్లు త్యాగ‌రాజులుగా మిగలాల్సిందే..!

RAMAKRISHNA S.S.
జ‌న‌సేన పార్టీ తాజా ఎన్నిక‌ల్లో 21 స్థానాల్లో పోటీచేసి 21 చోట్లా విజ‌యం ద‌క్కించుకుంది. పైగా కూట‌మి క‌ట్ట‌డంలోనూ.. వైసీపీని గ‌ద్దెదించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషించింది. ఈ పార్టీ లేకుంటే.. ఈ మేర‌కు భారీ సంఖ్య‌లో కూట‌మికి సీట్లు ద‌క్కేవి కాద‌ని.. ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి ప‌దువుల విష‌యంలో వీరు ఖ‌చ్చితంగా పోటీ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు సైతం దీనిని త‌ప్పించుకునే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది.

జ‌న‌సేన‌ను సంతృప్తి ప‌ర‌చాల్సి ఉంటుంద‌ని టీడీపీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం క‌న్నా.. ఆ పార్టీ వ‌ర్గాల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా.. తృప్తి ప‌ర చాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. వాడుకుని వ‌దిలేశార‌న్న వాద‌న తెర‌మీదికి రావ‌డం ఎంతో సేపు ప‌ట్టే లా లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా..జ‌న‌సేన‌కు ఖ‌చ్చితంగా ప్రాధాన్యం ఇచ్చేందుకు చూస్తారు. ఈ క్ర‌మంలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.

అంటే..ఇప్పుడు కూడా.. టీడీపీ నాయ‌కులు త్యాగాలు చేయాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. మొత్తం మంత్రి వ‌ర్గంలో సీఎం మిన‌హా 25 మందికి అవ‌కాశం ఉంది. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చింది. కామినేని శ్రీనివాస్ స‌హా దివంగ‌త మాణిక్యాల‌రావుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు జ‌న‌సేన కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ఆ పార్టీకి నాలుగు మంత్రి ప‌ద‌వులు ఆశించే అవ‌కాశం, ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా క‌నిపిస్తున్నాయి.

దీనికి తోడు.. బీజేపీకి కూడా.. గ‌తంలో మాదిరిగానే రెండు లేదా.. మూడు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్క‌డ బీజేపీకి ప్రాధాన్యం ఇచ్చి.. కేంద్రంలో తాము మంత్రి ప‌ద‌వులు పొందేందుకు చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నారు. దీంతో మొత్తంగా ఏడు మంత్రి ప‌ద‌వులు ఈ రెండు కూట‌మి మిత్ర ప‌క్షాల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిక‌న్నా ఎక్కువ‌గానే ప‌ద‌వులు ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఫ‌లితంగా 15-18 మ‌ధ్య ప‌ద‌వులు మాత్ర‌మే టీడీపీకి ద‌క్కుతాయి. అంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో సీట్లు.. ఇప్పుడు ప‌ద‌వులు కూడా.. ఆ పార్టీ నేత‌లు త్యాగం చేయాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: