జ‌గ‌న్ వ‌ల్ల కాదా... ష‌ర్మిల ఆ ప‌ని చేయాల్సిందే...!

RAMAKRISHNA S.S.
- బీజేపీ, జ‌న‌సేన టీడీపీ మిత్ర‌ప‌క్షాలే
- జ‌గ‌న్‌కు కేసుల టెన్ష‌న్ త‌ప్ప‌దు..
- క‌మ్యూనిస్టులు కూట‌మి గూట్లో వాళ్లే
- ష‌ర్మిల ప్ర‌తిప‌క్షం సీన్‌లోకి దూసుకొస్తారా..!
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు ఇస్తానంటూ.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్య‌తలు చేప‌ట్టిన రాజ‌న్న త‌న‌య వైఎస్ ష‌ర్మిల.. తాజా ఎన్నిక‌ల్లో బాగానే ప‌నిచేశారు. ఎవ‌రిని తిట్టారు.. ఎవ‌రిని పొడిగారు..అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఎన్నిక‌ల వేళ మాత్రం అలుపెరుగకుండా.. క‌ష్టించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్నీ స్పృశించారు. ఎక్క‌డా వెన్ను చూప‌లేదు. స‌మ‌స్య ఏదైనా స్పందించారు. మొత్తంగా ఒక వేడి అయితే.. ర‌గిలించారు. ఇప్పుడు ర‌గిలించిన వేడిని మున్ముందు.. వ‌చ్చే ఐదేళ్లు కూడా ..కొన‌సాగిస్తే.. కాంగ్రెస్ కొంత మేర‌కైనా పుంజుకునే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అయితే.. ఒక‌వైపు పార్టీని బ‌లోపేతం చేస్తూనే.. మ‌రోవైపు కీల‌క‌మైన బాధ్య‌త కూడా.. ష‌ర్మిల పోషించాల్సి  ఉంటుంది.  ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఓడిపోయిన వైసీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా పోయింది. అంతేకాదు.. పూలు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్మే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. ఒక‌ప్పుడు 151 మంది ఎమ్మెల్యేల‌తో నిండిపోయిన అసెంబ్లీ.. ఇప్పుడు బితుకు బితుకు మంటూ.. 11 మంది ఎమ్మెల్యేలు కూర్చునే ప‌రిస్థితి కి వ‌చ్చింది. పైగా.. వీరిలో ఎంత మంది ఉంటారో.. ఉండ‌రో.. తెలియ‌ని ప‌రిస్థితి కూడా నెల‌కొంది. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ గెలిచినా.. ఆయ‌న కూడా అసెంబ్లీకి వెళ్ల‌క‌పోవ‌చ్చు.

దీనిపై ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. త‌న‌కు తిరుగులేద‌ని.. వ‌చ్చే 30 ఏళ్ల‌పాటు తానే సీఎంగా ఉంటాన‌ని భావిం చిన జ‌గ‌న్‌.. భారీ ఎదురు దెబ్బ‌తిన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించే బాధ్య‌త ఎవరు తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మా రింది. ఎందుకంటే.. ఎంత ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌చ్చినా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించేందుకు ఒక గ‌ళం అయితే ఉండాలి. కానీ, ఇప్పు డు వైసీపీ ఆ పాత్ర పోసించే ప‌రిస్థితి లేదు. ఏం ప్ర‌శ్నిస్తే.. ఏం కేసు పెడ‌తారో.. అనే బెంగ స‌హ‌జంగానే వైసీపీకి ఉంటుంది. దీంతో నాయ‌కులు నోరు విప్పే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక‌, జ‌గ‌న్ కూడా.. ఈ విష‌యాన్ని లైట్ తీసుకుంటార‌నే భావించాలి.

ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీలను ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన ఎలానూ.. కూట‌మిలో ఉంది. బీజేపీ కూడా కూట‌మి ప‌క్ష‌మే. దీంతో ప్ర‌భుత్వాన్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు.. క‌మ్యూనిస్టులు కూడా.. దాదాపు కూట‌మికి సానుకూలంగానే ఉన్నారు. ఈ ప‌రిణా మాల నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం విప్పే బాధ్య‌త‌.. ప్ర‌శ్నించే అవ‌స‌రం, అవ‌కాశం అన్నీ కూడా.. ష‌ర్మిల వైపు ప‌రుగులు పెట్టి వ‌స్తున్నాయి. ఈ అవ‌కాశాన్ని ఆమె ఏమాత్రం  వినియోగించుకున్నా తిరుగులేని నాయ‌కురాలిగా.. ఈ ఐదేళ్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పోషించే అవ‌కాశం.. నాయ‌కురాలిగా స్థిర‌ప‌డే అవ‌కాశం మెండుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: