పవన్: రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అవుతాడా ?

Purushottham Vinay
•పవన్ కళ్యాణ్ పై పెద్ద బాధ్యత పెట్టిన ప్రజలు 


•గెలుపు కోసం కష్టపడ్డ పవన్ ప్రజాసేవ కోసం కూడా కష్టపడాలని ఆశిస్తున్న ప్రజలు


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఏకంగా 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను 10 సంవత్సరాలు కష్టపడి నెరవేర్చుకున్నారు.రాజకీయాలలో ఓర్పు అనేది ఎంతో ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంతో పవన్ కళ్యాణ్ నిరూపించారు.పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నాయి.అయితే మొదట అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్‌కు మద్దతు ఇస్తారా లేదా అనే సందిగ్థం నెలకొంది.అయితే, ఎమ్మెల్సీని చేస్తానని వర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్మకు తగిన మద్దతు ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడంతో తెలుగుదేశం, జనసేన కేడర్ కలసి పనిచేయడం సులువైపోయింది.పవన్ కళ్యాణ్ ని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అక్కడ కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీతను బరిలోకి దించింది. దీని ద్వారా ఆ సామాజిక ఓట్లు భారీగా చీలిపోయి పవన్ కళ్యాణ్ ఓటమి చవి చూస్తారనే వైసీపీ భావించింది.మరో పక్క ముద్రగడ పద్మనాభం లాంటివారు పవన్ కల్యాణ్‌ను ఓడించాలంటూ పిలుపునివ్వడంతో రాష్ట్రం మొత్తం కూడా పిఠాపురంపైనే దృష్టి పెట్టింది.ఏదీ ఏమైనా అన్ని అడ్డంకులు దాటుకొని పవర్ స్టార్ రాజకీయ నేతగా మారి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. 


సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అని అనిపించుకోవాలి. కాబట్టి ఇక నుంచి ఎమ్మెల్యేగా పవన్ పై పెద్ద బాధ్యతే పడింది. ఈ క్రమంలో ఆయన నిజమైన పవర్ స్టార్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలకి మేలు చెయ్యాలి. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి కూడా గతంలో జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకొని భారీ విజయంతో సీఎం అయ్యారు. కానీ ఆ ప్రేమని జగన్ నిలబెట్టుకోలేకపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక నుంచి 5 ఏళ్ల పాటు జనాల ప్రేమని పెంచుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం యూత్. కాబట్టి యూత్ కోసం పవన్ కళ్యాణ్ రాబోయే 5 ఏళ్లలో ఏమైన చెయ్యాలి. నిరుద్యోగులు కోసం కష్టపడాలి.అంతేకాదు జనాలకు తాను ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎప్పటి నుంచో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ సమస్యని తీర్చేందుకు కృషి చెయ్యాలి. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పేద వాళ్ళు ఎక్కువ. మురికివాడలు ఎక్కువ. కాబట్టి గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో జనాలకి మంచి చెయ్యడానికి కూడా అంతే కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వారి మేలు కోసం కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలి. చేతిలో అధికారం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ వచ్చేదాకా పోరాటం చెయ్యాలి. ఇలా ఇవన్నీ చేస్తేనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అవుతారు. లేదంటే మరో జగన్ మోహన్ రెడ్డి అవుతారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ జనాలకి ఎలాంటి మేలు చేస్తారనేది..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: