ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్లూ జరా భద్రం !

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే 2024 ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చాయి. ఏపీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఒక పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్లు జరభద్రంగా ఉండాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
గుంటూరు జిల్లా లక్ష్మీపురంకు చెందిన ఒక హాస్టల్ ఓనర్ పై జన సైనికులు దాడి చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హాస్టల్ నేమ్ బోర్డులో రెడ్డి అని ఉండటంతో పాటు హాస్టల్ యజమాని టీడీపీ, జనసేన స్టిక్కర్లను అతికించడానికి నిరాకరించడంతో కొంతమంది పవన్ అభిమానులు హాస్టల్ ఓనర్ పై దాడి చేసినట్లు సమాచారం. హాస్టల్ యజమానిపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు తమ పాదాలను తాకాలని అతనిని మోకాళ్లపై నిలబెట్టారని భోగట్టా.
 
పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకున్న ఆ వ్యక్తులు హాస్టల్ ఓనర్ ను కులం పేరుతో దుర్భాషలాడటంతో పాటు హాస్టల్ తలుపులు, అద్దాలు ధ్వంసం చేశారని హాస్టల్ దగ్గర ఉన్న పూల కుండీలను సైతం పగులగొట్టారని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధంగా దాడులు చేయడంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
జన సైనికులు దాడి చేసిన ఫోటోలు, వీడియోలు సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో  వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లపై కూడా దాడులు జరగడం హాట్ టాపిక్ అవుతోంది. సామాన్య ప్రజలు ఇలాంటి వాటిని హర్షించరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై కూటమి నేతలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాడులు అలాగే కొనసాగితే కూటమి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని వినిపిస్తున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: