పుంగనూరు పోటుగాడు పెద్దిరెడ్డే.. వైసీపీ మంత్రుల్లో ఒకే ఒక్క విజేతగా నిలిచాడుగా!

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఒకింత ఆసక్తి కలిగించిన నియోజకవర్గాలలో పుంగనూరు ఒకటి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అత్యంత కీలక నియోజకవర్గాలలో ఒకటిగా పుంగనూరుకు పేరుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వరుస విజయాలు దక్కాయి. పుంగనూరు నియోజకవర్గంలో సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్లతో పాటు పుంగనూరు, చౌడేపల్లె మండలాలు ఉన్నాయి.
 
ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పెద్దిరెడ్డికి బలం కాగా కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉండటం ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించడం ఆయనకు మైనస్ అయ్యాయి. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మరోమారు సత్తా చాటడం గమనార్హం. రెడ్డి, ముస్లిం, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉండటం పెద్దిరెడ్డికి ప్లస్ అయింది.
 
వైసీపీ నుంచి గెలిచిన ఏకైక మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్ర సృష్టించారు. చల్లా రామచంద్రారెడ్డి గట్టి పోటీ ఇచ్చినా పెద్దిరెడ్డి మాత్రం కూటమి వేవ్ లో సత్తా చాటారు. వైసీపీకి చెందిన ప్రముఖ నేతలు ఓటమిపాలు కాగా పెద్దిరెడ్డి మాత్రం విజేతగా నిలవడం కొసమెరుపు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో 6619 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
 
తొలి రౌండ్, రెండో రౌండ్ లో స్వల్పంగా వెనుకబడిన ఆయ్నా మూడో రౌండ్ నుంచి పుంజుకోగా మొత్తంగా ఆయనకు 99,774 ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో చల్లా రాంచంద్రారెడ్డికి మాత్రం కేవలం 93,115 ఓట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి నక్కతోక తొక్కాడని అందువల్లే ఎంతోమందికి ఓటమి ఎదురైనా ఆయనకు మాత్రం సులువుగానే గెలుపు దక్కిందని చిత్తూరు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఊరటను కలిగించిందని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: