నిడదవోలు : ప‌వ‌న్ - బాబు చెప్పిన‌ట్టు విని గెలిచిన జ‌న‌సేన దుర్గేష్‌..!

RAMAKRISHNA S.S.
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున విస్తరించి ఉన్న నియోజకవర్గం నిడదవోలు.. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో నిడదవోలు కొత్తగా ఆవిర్భవించింది. నియోజకవర్గం లో నిడదవోలు మున్సిపాలిటీ తో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు ఉన్నాయి. రాజకీయంగా చూస్తే అగ్ర కులాలలో కమ్మ, కాపు సామాజిక వ‌ర్గాల ప్రాభల్యం ఎక్కువగా ఉంది. వరుసగా రెండు ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించగా.. గత ఎన్నికలలో మాత్రమే ఇక్కడ వైసీపీ తొలిసారిగా గెలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన జి.ఎస్.రావు తనయుడు జి. శ్రీనివాసులు నాయుడు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే ఈసారి కూటమి పొత్తు నేపథ్యంలో నిడదవోలు సీటును జనసేనకు కేటాయించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుని కాదని.. రాజమండ్రికి చెందిన కందుల‌ దుర్గేష్ కు ఇక్కడ జనసేన టికెట్ దక్కింది. వాస్తవానికి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీటు ఆశించారు. అయితే అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత బుచ్చ‌య్య‌ చౌదరి సీటు త్యాగం చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో పవన్.. చంద్రబాబు అంగీకారానికి వచ్చి దుర్గేష్ కు నిడదవోలు సీటు కేటాయించారు.

దుర్గేష్ నిడదవోలుకు నాన్ లోకల్ అయినా కూడా.. తెలుగుదేశం పార్టీ సహకారంతోపాటు.. నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం.. పవన్ కళ్యాణ్ అభిమానుల స‌పోర్ట్‌తో చాలా తక్కువ టైంలోనే ఆయన బలమైన ప్రత్యర్థిగా మారారు. ఆ మాటకు వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ‌నివాసులు నాయుడు కూడా నియోజకవర్గానికి నాన్ లోకల్ అవుతారు. ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యాక‌ ఇటు పోలింగ్‌లో గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నా.. చివరిలో దుర్గేష్ కాస్త పై చేయి సాధించారని కచ్చితంగా ఆయనే గెలుస్తారన్న అంచనాలు, నివేదికలు ఎక్కువగా వినిపించాయి. ఇక ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో దుర్గేష్ ఏకంగా 33304 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. దుర్గేష్ ఫ‌స్ట్ టైం అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: