ఆదోనిలో అదుర్స్ అనిపించిన బీజేపీ.. అన్ని వేల మెజారిటీతో ఆ అభ్యర్థిదే విజయమా?

Reddy P Rajasekhar
కర్నూలు జిల్లాలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని ప్రచారం జరిగిన నియోజకవర్గాల్లో ఆదోని ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో 2004, 2014, 2019 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచిన సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేయగా కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా పీవీ పార్థసారథి పోటీ చేయడం జరిగింది. ఆదోనిలో స్థానికంగా బీజేపీకి పెద్దగా గుర్తింపు లేకపోవడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీదే విజయమని ప్రచారం జరిగింది.
 
2004లో కాంగ్రెస్ నుంచి పోటీ సాయిప్రసాద్ రెడ్డి 2014, 2019 సంవత్సరాల్లో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో సాయిప్రసాద్ రెడ్డి 12,319 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నూలులోని ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూస్తే ఈ నియోజకవర్గంలో పోలింగ్ కొంతమేర తక్కువగా నమోదైంది. అయితే ఆదోని నియోజకవర్గంలో మంచి పేరు ఉండటం, వైసీపీ సంక్షేమ పథకాలు, రాజకీయ అనుభవం సాయిప్రసాద్ రెడ్డికి ప్లస్ అయ్యాయి.
 
అయితే ఎన్నికల ఫలితం మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్థసారథి ఏకంగా 18,563 ఓట్ల మెజార్టీతో నియోజకవర్గంలో సత్తా చాటారు. టీడీపీ, జనసేన ఓటు బదిలీ కావడం వల్లే పార్థసారథి సులువుగా విజయం సాధించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
ఆదోనిలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సాయిప్రసాద్ రెడ్డికి ఈ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా షాకింగ్ ఫలితం వచ్చింది. నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోయినా సాయిప్రసాద్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత పార్థసారథికి కలిసివచ్చిందని ఆ విధంగా పార్థసారథి సులువుగా విజయం సాధించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్థసారథి గెలుపుతో నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సత్తా చాటడంతో రాష్ట్రంలో బీజేపీ సైతం క్రమంగా పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: