తుని : య‌న‌మ‌ల ఫ్యామిలీ ఈ విజ‌యంతో చిన్న‌గా ఊపిరి పీల్చుకో...!

RAMAKRISHNA S.S.
తెలుగుదేశం పార్టీకి గత 20 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా పట్టు చిక్కని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు గత మూడు, నాలుగు ఎన్నికలలో పార్టీ వరుసగా ఘోరంగా ఓడిపోతూ వస్తున్న నియోజకవర్గాలలో కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గం ఒకటి. తుని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే 2004 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా తన పట్టు కోల్పోతూ వస్తోంది. యనమల రామకృష్ణుడు కుటుంబం పై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ కుటుంబం ఇక్కడ వరుసగా మూడుసార్లు ఓడిపోయింది.

తాజా ఎన్నికలలోను చంద్రబాబు య‌న‌మ‌ల‌ కుటుంబాన్ని పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు. యనమల కుమార్తె యనమల దివ్యకు అవకాశం ఇచ్చారు. అయితే గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన య‌నమల కృష్ణుడు తనకు సీటు ఇవ్వకపోవడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ ప్రస్తుతం మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా పోటీలో ఉన్నారు. మామూలుగా చూస్తే నియోజకవర్గం లో కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా అధిపత్యం ఉంది. దాడిశెట్టి రాజా కాపు సామాజిక‌ వర్గానికి చెందిన నేత కాగా.. యనమల దివ్య బీసీలలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు.

పైగా ఎన్నికలలో యనమల ఫ్యామిలీ నుంచి ఏకంగా ముగ్గురు నేతలకు టిక్కెట్లు దక్కాయి. నియోజకవర్గంలో తుని మున్సిపాలిటీ తో పాటు.. తుని, తొండంగి, కోటనందూరు మండలాలు విస్తరించి ఉన్నాయి. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి చాలా బలంగా ఉందన్న చర్చ గత రెండు, మూడు నెలలుగా నడుస్తున్న తునిలో మాత్రం టీడీపీ కచ్చితంగా గెలుస్తుందన్న అంచనాలు అయితే లేవు. గట్టి పోటీ ఉంది గట్టి పోటీ మధ్యలో వైసీపీకే స్వల్ప ఆధిక్యం ఉంది అన్న ప్రచారమే ఎక్కువగా నడిచింది ఫైనల్ గా ఈరోజు జరిగిన కౌంటింగ్లో 15177 ఓట్ల మెజార్టీతో ఎట్ట‌కేల‌కు య‌న‌మ‌ల దివ్య గెలిచింది. చాలా యేళ్ల త‌ర్వాత‌.. వ‌రుస ఓట‌ముల త‌ర్వాత ఇక్క‌డ య‌న‌మ‌ల ఫ్యామిలీకి విజ‌యం గొప్ప  ఊర‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: