వైసీపీ కంచుకోటలో ఫలితం తారుమారు.. టీడీపీ అభ్యర్థి పైచేయి సాధించాడుగా!

Reddy P Rajasekhar
కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ఆదిమూలపు సతీష్ పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పోటీ చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని అభ్యర్థులు కోడుమూరు నుంచి పోటీ చేయగా 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో వైసీపీ ఈ నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
 
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అటు ఆదిమూలపు సతీష్ ఇటు బొగ్గుల దస్తగిరి హోరాహోరీగా ప్రచారం చేశారు. కోడుమూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెకూ తిరిగి ఎన్నికల్లో విజయం సాధిస్తే అమలు చేసే పథకాలను వెల్లడించడంతో పాటు కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇద్దరు అభ్యర్థులు కీలకమైన హామీలను ఇవ్వడం జరిగింది. ఆదిమూలపు సతీష్, బొగ్గుల దస్తగిరిలకు ప్రముఖ జిల్లాలోని ప్రముఖ నేతల అండ ఉండటం వారికి ప్లస్ అయింది.
 
అయితే కోడుమూరు నియోజకవర్గంలో బొగ్గుల దస్తగిరికి అనుకూలంగా ఫలితం వెలువడటం గమనార్హం. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పై 21,746 ఓట్లతో బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు. విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు అయిన బొగ్గుల దస్తగిరి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కష్టపడగా ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. వైసీపీపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత ఆయనకు ప్లస్ అయింది.
 
పసుపుల గ్రామానికి చెందిన బొగ్గుల దస్తగిరి విజయంతో కోడుమూరు, చుట్టుపక్కల మండలాలలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సౌమ్యుడిగా పేరును సొంతం చేసుకున్న బొగ్గుల దస్తగిరి సర్వేలకు సైతం షాకిచ్చేలా కోడుమూరులో అనుకూల ఫలితాన్ని అందుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కోడుమూరులో టీడీపీ జెండా ఎగురవేశారు. కోడుమూరు నియోజకవర్గంలో ఊహించని ఫలితం వచ్చిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బొగ్గుల దస్తగిరి పాలన ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: