పామర్రు : ఎన్టీఆర్ గ‌డ్డ‌పై స‌గ‌ర్వంగా ఎగిరిన ప‌సుపు జెండా... ఆ క్రెడిట్ నీకే కుమార్ రాజా..!

RAMAKRISHNA S.S.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం ఉన్న నియోజకవర్గం పామర్రు. పామర్రు మండలంలోని నిమ్మకూరు ఎన్టీఆర్ స్వగ్రామం. 2009 లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత మూడు ఎన్నికలలో ఇక్కడ ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. అంటే తెలుగుదేశం పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఎలా ఉందో తెలుస్తోంది. 2009, 2014, 2019 మూడు ఎన్నికల్లోను వరుసగా ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయింది.
నియోజ‌క‌వ‌ర్గంలో పామ‌ర్రు , తోట్ల‌వ‌ల్లూరు , ప‌మిడిముక్క‌ల , మొవ్వ , పెద‌పారుపూడి మండ‌లాలు ఉన్నాయి.

తాజా ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ నుంచి పాత ప్రత్యర్థులే మరోసారి పోటీ పడ్డారు. టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజా బరిలో ఉండగా.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో ఏకంగా 36 వేల ఓట్ల భారీ మెజార్టీతో అనిల్ కుమార్ ఘనవిజయం సాధించారు. ఇక తాజా ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా వ్యాప్తంగా జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో మెజార్టీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థుల విజయం సాధిస్తారన్న అంచనాలు బలంగా ఉన్న పామర్రులో మాత్రం గట్టి పోటీ మధ్యలో వైసీపీకే స్వల్ప ఆధిక్యత ఉందన్న ప్రచారం గట్టిగా వినిపించింది. గత ఎన్నికలలో ఓడిపోయిన కుమార్ రాజా ఐదేళ్లపాటు నియోజకవర్గంలో ఉండి.. కష్టపడి పనిచేసి ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదల ప్రదర్శించారు.

ఇక తాజాగా ఈ రోజు కౌంటింగ్ లో కుమార్ రాజాకు ఏకంగా 29690 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. మొత్తానికి తండ్రి వ‌ర్ల రామ‌య్య ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఆయ‌న చ‌ట్ట స‌భ‌ల‌కు వెళ్ల‌లేక‌పోయారు. ఆ లోను వార‌సుడు కుమార్ రాజా భ‌ర్తీ చేసేశారు. మంచి విజ‌యంతో ఎన్టీఆర్ గ‌డ్డ‌పై స‌గ‌ర్వంగా టీడీపీ జెండా ఎగ‌ర‌వేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: