అమలాపురం : మంత్రి విశ్వ‌రూప్‌కు ఆనందం లేకుండా చేశాడుగా.. అయితాబ‌త్తుల సూప‌ర్ విక్ట‌రీ..!

RAMAKRISHNA S.S.
కోనసీమ జిల్లా కేంద్రంగా ఉన్న అమలాపురం నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోల్‌ జరిగింది. మరోసారి పాత ప్రత్య‌ర్ధులే పోటీపడ్డారు. వైసీపీ నుంచి మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్ తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పోటీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా ఉన్న అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం మున్సిపాలిటీ తో పాటు అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలు విస్తరించి ఉన్నాయి. నియోజకవర్గంలో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలు రాజకీయంగా తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి.

ఇక ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మంత్రిగా ఉన్న విశ్వరూప్ పై ఈసారి కోనసీమ అల్లర్లతో పాటు రకరకాల అంశాల నేపథ్యంలో వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది. ఒకానొక దశలో విశ్వరూప్ కుమారుడు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే జగన్ చివరకు విశ్వరూప్ కే సీటు ఇచ్చారు. ఇటు తెలుగుదేశం కూడా మాజీ ఎమ్మెల్యే ఆనందరావుకే టికెట్ ఖరారు చేసింది.

ఎన్నికలకు ఆరు, ఏడు నెలల ముందు నుంచే జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో.. అమలాపురంలో ఈసారి మంత్రి విశ్వరూప్‌ ఖచ్చితంగా ఓడిపోతారు అన్న ప్రచారం చాలా గట్టిగా నడిచింది. కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండటం పవన్ కళ్యాణ్, జనసేన అభిమానుల ప్రభావం ఓటమి నేపథ్యంలో అమలాపురంలో టీడీపీ అభ్యర్థికి బాగా కలిసి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రచారం.. పోలింగ్ తర్వాత కచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచే సీట్లలో అమలాపురం ముందు వరుసలో ఉంటుందన్న అంచనాలు నివేదికలు వచ్చేసాయి.

ఈరోజు జరిగిన కౌంటింగ్లో టీడీపీ అభ్య‌ర్థి ఆనంద‌రావు ఏకంగా 37832 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. కూట‌మి దెబ్బ‌తో ఇది మామూలు విజ‌యం కాదు.. అతి పెద్ద విజ‌యం అని చెప్పాలి. ఏదేమైనా అమ‌లాపురంలో మంత్రి విశ్వ‌రూప్ శ‌కం ఈ ఎన్నిక‌ల‌తో దాదాపు ముగిసిన‌ట్టే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: