తిరువూరు : అమ‌రావ‌తి జేఏసీ హీరో శీను ను ఎమ్మెల్యేను చేసేశారు..!

RAMAKRISHNA S.S.
తిరువూరు పై ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా దృష్టి సారించారు. ఎప్పుడో 1999లో మాత్రమే చివరిసారిగా తిరువూరులో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికలలో వరుసగా ఓడిపోతూ వస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో తిరువూరు మున్సిపాల్టీ తో పాటు తిరువూరు , గంప‌ల‌గూడెం , ఏ. కొండూరు , విస్స‌న్న‌పేట మండ‌లాలు ఉన్నాయి. గత ఎన్నికలలో అప్పుడు మంత్రిగా ఉన్న కె.ఎస్. జవహర్ ను కొవ్వూరు నుంచి తిరువూరుకు బదిలీ చేసి.. పోటీ చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఈసారి చంద్రబాబు మళ్ళీ ప్రయోగం చేశారు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి జవహర్‌ను తీసుకువచ్చి.. తిరువూరులో పోటీ చేయించిన బాబు.. ఈసారి అమరావతి ఉద్యమంలో జేఏసీలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుంచి పోటీ చేయించారు. అటు వైసీపీ లోను జగన్ ప్రయోగం చేశారు.

సిటింగ్ ఎమ్మెల్యే.. అందులోను వరుసగా రెండుసార్లు గెలిచిన కొక్కిలిగడ్డ రక్షణ నిధిని పక్కన పెట్టేసిన జగన్.. టీడీపీలో వరుసగా మూడుసార్లు ఓడిపోతూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసును వైసీపీలోకి తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు పార్టీ మారిన స్వామి దాసుకు నాని సిఫార్సు మేరకు తిరువూరు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా చూస్తే కొలికిపూడి.. తిరువూరుకు నాన్‌ లోకల్. పైగా ఆయన ఇక్కడ టీడీపీ క్యాడ‌ర్‌ను సరిగా కలుపుకు పోలేదన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపించాయి. అటు స్వామి దాసు సౌమ్యుడు.. పైగా వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయాడన్న సానుభూతి ఉంది. అయితే రెండుసార్లు గెలిచిన రక్షణ నిధికి జగన్ సీటు ఇవ్వకపోవడం.. ఆయన వర్గం దూరంగా ఉంది. దీంతో తిరువూరులో ఎవరు గెలుస్తారు అన్నది ముందు నుంచి తీవ్ర ఉత్కంఠ రేపింది.

హోరాహోరీగా న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన తిరువూరు స‌మ‌రంలో అంతిమ విజేత‌గా కొలిక‌పూడి నిలిచారు. ఆయ‌న‌కు ఏకంగా 20 వేల ఓట్ల పై చిలుకు భారీ మెజార్టీ వ‌చ్చింది. ఏదేమైనా అమ‌రావ‌తి జేఏసీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కొలిక‌పూడి చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లేలా తిరువూరు ప్ర‌జ‌లు మంచి బ‌హుమ‌తి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: