భీమవరం బాద్ షా... గంటా వియ్యంకుడు పార్టీ మారినా దంచి కొట్టి ప‌డేశాడు... ప‌వ‌న్ రివేంజ్ ఈ స్థాయిలోనా..?

RAMAKRISHNA S.S.
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పేరు చెబితే గత ఎన్నికలలో ఎంత మార్మోగిందో.. ఎలా పాపులర్ ? అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పైగా భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న నరసాపురం పార్లమెంటుకు.. పవన్ సోదరుడు నాగబాబు ఎంపీగా పోటీ చేశారు. ఇద్దరు గత ఎన్నికలలో ఓడిపోయారు. ఇక తాజా ఎన్నికల విషయానికొస్తే గత ఎన్నికల్లో ఓడిపోయినా.. మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆయన భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని.. అందరూ అనుకున్నారు. నామినేషన్ చివరి వరకు కూడా పవన్ భీమవరం బరిలోనే ఉంటారని అందరూ అనుకున్నారు.

అయితే చివర్లో పవన్ అనుహ్యంగా.. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే భీమవరం నుంచి మరోసారి పాత ప్రత్యుర్ధులే పోటీపడ్డారు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఎన్నికలకు ముందు జనసేనలో చేరి.. జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లోను వీరే తలపడటం విశేషం. అయితే ఈసారి అంజిబాబు పార్టీ మారి పోటీ చేస్తున్నారు.

భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు.. భీమవరం వీరవాసరం మండలాలు విస్తరించి ఉన్నాయి. నియోజకవర్గంలో అగ్రకులాలలో కాపు, క్షత్రియ సామాజిక వర్గ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అలాగే బీసీలలో శెట్టిబలిజ ఇతర కులాలతో పాటు ఎస్సీ ఓటర్‌లు కూడా ఎక్కువగానే ఉన్నారు. నియోజకవర్గం లో కాపుల రాజకీయ ప్రాబల్యం బాగా పెరిగింది. నామినేషన్లకు ముందు పోలింగ్ సరళిన్ని బట్టి చూస్తే కచ్చితంగా జనసేన మంచి మెజార్టీతో గెలుస్తుందని ఎక్కువమంది చెప్పారు. గత ఐదు, ఆరు నెలలుగా ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసిన భారీ మెజార్టీ ఖాయం అనుకున్నారు. అయితే చివరిలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కాస్త పోటీ ఇచ్చినా.. జనసేనకే ఎడ్జ్ ఉంటుందన్న నివేదికలే ఎక్కువగా వినిపించాయి.

ఇక ఈ రోజు కౌంటింగ్‌లో జ‌న‌సేన అభ్య‌ర్థి పుల‌ప‌ర్తి అంజిబాబు ఏకంగా 64 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై ఘ‌న‌విజ‌యం సాధించిన అంజిబాబు ప‌వ‌న్ ను ఓడించిన గ్రంధిపై మామూలు రివేంజ్ తీర్చుకోలేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: