హాట్ సీట్లు... వీఐపీ లీడ‌ర్లు వీళ్లు గెలుస్తారా...!

RAMAKRISHNA S.S.
ఒక‌వైపు రాష్ట్రంలో చ‌ర్చ‌బాగానే ఉంది. ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడ‌తార‌నే విష‌యం ఆస‌క్తిగానే ఉంది. కానీ, తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో దేశంలోనూ ఏపీని మించిన రాజ‌కీయాలు జ‌రిగాయి. దేశ వ్యాప్తంగా కూడా.. ఏపీలో ఉన్న ఉత్కంఠే ఉంది. ఏపీలో ఎలా అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు వ‌చ్చాయో.. అలానే దేశంలోనూ వ‌చ్చాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో దేశంలో ఏం జ‌రుగుతుంది?  కీల‌క నేత‌లు గెలుస్తారా?  అనేది న‌రాలు తెగే ఉత్కంఠ‌గా మారింది.

దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన 18వ పార్ల‌మెంటు ఎన్నిక‌లు అత్యంత ఉత్కంఠ‌గా సాగిన విష‌యం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కం గా పోటీ చేశాయి. గెలుపుపై ఎవ‌రికి వారే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.   అనేక మంది సినీ రంగ ప్ర‌ముఖులు కూడా.. పోటీ చేశారు. మ‌రి వారు గెలుస్తారా?  చ‌రిత్ర సృష్టిస్తారా?  లేక‌.. ఏం జ‌రుగుతుంద‌నేది ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా... చ‌ర్చ‌నీయాంశం అయింది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని  కాశీ  నుంచి వ‌రుస‌గా మూడో సారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. 2014లో తొలిసారి ఆయ‌న ఇక్క‌డ బ‌రిలో నిలిచి గెలిచారు.

2019లోనూ మోడీ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా.. ఇక్క‌డే పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌రుస‌గా మూడో సారి అజ‌య్ రాయ్ పోటీలో ఉన్నారు. మ‌రి ఇప్పుడు ఏ మేర‌కు మోడీ గెలుస్తారో చూడాలి. అలానే.. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి. ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌..  తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు.  ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రాజ‌వంశానికి చెందిన విక్ర‌మా దిత్య బ‌రిలో ఉన్నారు. వీరి మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా జ‌రిగింది. మ‌రి కంగ‌న గెలుస్తారా? అనేది బాలీవుడ్ ఆశ్చ‌ర్యంతో ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్  కీల‌క నాయ‌కుడు రాహుల్ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ నుంచి పోటీ చేస్తున్నారు. కేర‌ళ‌లోని   వ‌య‌నాడ్ లో ఆయ‌న‌కు కూట‌మి పార్టీ సీపీఐ నుంచి గ‌ట్టి పోటీ ఉంది. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి రాజా స‌తీమ‌ణి అన్నీ పోటీలో ఉన్నారు. ఇక‌, యూపిలోని గాంధీల సొంత నియోజ‌క‌వ‌ర్గం రాయ బరేలిలో రాహుల్ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థిగా దినేష్ ప్ర‌తాప్ సింగ్ పోటీలో ఉన్నారు. ఇక్క‌డ ఓడించేందుకు బీజేపీ చాలానే ఎత్తుగ‌డ‌లు వేసింది. మ‌రి ఏమేర‌కు వాటిని ఛేదిస్తారో.. గాంధీల వార‌స‌త్వం నిల‌బెడ‌తారో.. అనే ఉత్కంఠ నెల‌కొంది.

ద‌క్షిణాది సినీ రంగంలో తిరుగులేని న‌టిగా ఉన్న రాధిక‌..తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. బీజేపీ త‌ర‌ఫున త‌మిళ‌నాడులోని విరుధ్ న‌గ‌ర్ పార్ల‌మెంటు స్థానంలో  పోటీ చేస్తున్నారు. ఈమెపై ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాణిక్కం ఠాకూర్‌, డీఎండీకే త‌ర‌ఫున విజ‌య్ ప్ర‌భాక‌ర‌న్ కూడా గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. వీరిని త‌ట్టుకుని గెలిచేందుకు రాధిక చ‌మ‌టోడ్చారు. ఏకంగా రాధిక భ‌ర్త శ‌ర‌త్‌కుమార్ దేవుళ్ల‌కు పొర్లు దండాలు పెట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ పూజ‌లు ఫలిస్తాయా?  లేదా అన్న‌ది చూడాలి.

తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కూడా ఈ ఎన్నిక‌ల్లో అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. త‌మిళ‌నాడులోని సౌత్ చెన్నై  నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈమెపై డీఎంకే త‌ర‌ఫున తంగ‌పాండియ‌న్ ఉర‌ఫ్ సుమతి పోటీ చేస్తున్నారు. కాగా. గ‌తంలో రెండు సార్లు పోటీ చేసిన త‌మిళిసై రెండు సార్లూ ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రి ఇప్పుడు ఈమె గెలుస్తారా?  లేదా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే మ‌రో రెండేళ్లు గ‌వ‌ర్న‌ర్ ప‌దవి ఉండ‌గానే దానిని వ‌దులుకుని వ‌చ్చి ఆమె ఇక్క‌డ పోటీ చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: