పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పొలిటికల్ విశ్లేషకులు... అంచనాలు నిజమయ్యేనా?

Suma Kallamadi
దేశంలో హఠాత్తుగా ఈసారి అనేకమంది సెఫాలజిస్టులు (రాజకీయ విశ్లేషకులు) పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు. విషయం దేవుడికెరుకగాని, యూట్యూబ్ ఛానల్ ఉండి, కాస్త మాట్లాడగలిగే స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కడూ ఇపుడు తానొక పెద్ద పొలిటికల్ అనలిస్ట్ గా ప్రకటించుకున్న పరిస్థితి. ఇదే విషయాన్ని నిరూపించాయి తాజా సర్వేలు. దాంతో ఇపుడు అలాంటి సర్వేలను నమ్మాలో, నమ్మకూడదో అన్న మీమాంసలో పడ్డారు సగటు ఓటర్లు. మన ఆంధ్రాలో చూసుకుంటే మునిపటికంటే కూడా ఈసారి చాలా ఎక్కువ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్ ని నిర్వహించాయి. అందులో దాదాపుగా అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషించడం గమనార్హం.
అంతేకాకుండా దేశంలో ఉన్న ప్రముఖ సెఫాలజిస్టులు, ఎన్నికల నిపుణులు అందరూ ఏపీలో టీడీపీ కూటమికే జై కొట్టారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా మరికొన్ని ఛానెల్స్ చెప్పుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గెలుపు మాదేనంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రకటిస్తూ ఉంటే... ఈసారి మా గెలుపుని ఆపడం ఎవరి వల్లా కాదు అని కూటమి నాయకులు, కార్యకర్తలు ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి వుంది. అయితే వైసీపీ తరపున మీడియా చానళ్లలో జోరుగా బ్యాటింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వంటి విశ్లేషకులు చెబుతున్నది ఏమంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని. ఆయన విశ్లేషణ ఆయనది.
అయితే ఒకింత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు మాట్లాడేదేమంటే కొందరు సెఫాలజిస్టులు, కొందరు సీనియర్ రాజకీయవేత్తలు, కొన్ని సంస్థలు ఎవరికివారుగా సొంత సర్వే అంటూ ఫలితాలను ప్రకటించాయి.. వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దని. ఇలాంటి ఫలితాల వలన ఒరిగేది ఏమీ లేదని, ఇంకొక్క రోజు కళ్ళుమూసుకుంటే ఎవరి సత్తా ఏమిటో బయటపడిపోతుందనేది వారి మాట. నిజమేమరి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండగ ఈ భారత ఎన్నికల ప్రక్రియ. దాదాపు వంద కోట్ల మంది ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంటూ ఉండడమే దీనికి కారణం. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఎవరికి మద్దతిచ్చారనేది తెలుసుకునేందుకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి అలాంటివారి ఎదురుచూపులకి రేపు జూన్ 4న చెక్ పడనుంది. అదే సమయంలో కొన్నిస్థానాల్లో మెజార్టీలపైన జోరుగానే బెట్టింగులు నడుస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: