హిందూపూర్ లో బాలయ్య హ్యాట్రిక్ పక్కా.. ఆ తప్పులే దీపికకు మైనస్ అయ్యాయా?

Reddy P Rajasekhar
ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్ లో మరోసారి బాలయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించడం పక్కా అని తేలిపోయింది. బాలయ్య నియోజకవర్గం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే తీరు ఆయన గెలుపునకు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య నియోజకవర్గంలో ఎక్కువగా ఉండకపోయినా నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరించేవారని హిందూపురం వాసులు చెబుతున్నారు.
 
2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బాలయ్య 2024 ఎన్నికల్లో కూడా సులువుగానే గెలవనున్నారని తెలుస్తోంది. 20 వేల మెజార్టీ వస్తుందో 30 వేల మెజార్టీ వస్తుందో చెప్పలేం కానీ భారీ మెజార్టీ మాత్రం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దీపిక కొత్త అభ్యర్థి కావడం, వైసీపీ నేతలు కార్యకర్తల నుంచి సరైన మద్దతు లభించకపోవడం, బాలయ్యకు ధీటైన అభ్యర్థి కాకపోవడం ఆమెకు మైనస్ అయ్యాయి.
 
హిందూపురం నియోజకవర్గంలో విజయం సాధించాలని వైసీపీ కలలు కన్నా ఆ కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో బీసీల ఓట్లు కీలకం కాగా బీసీల ఓట్లతో టీడీపీ సునాయాసంగానే విజయం సాధించే ఛాన్స్ ఉంది. హిందూపురం టీడీపీ కంచుకోట కావడం కూడా ఆ పార్టీకి ఎంతగానో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
 
దీపిక కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాగా ఆ సామాజిక వర్గం ఓట్లు మాత్రం దీపికకే పడ్డాయని సమాచారం అందుతోంది. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సైతం తనను గెలిపిస్తాయని దీపిక బలంగా నమ్మారు. ఎన్నికల ఫలితాలు మరో 72 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో హిందూపురంలో గెలుపునకు సంబంధించి సందేహాలు అస్సలు అక్కర్లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఓటమి లేదు. ఈ ఎన్నికల్లో సైతం అదే ఫలితం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందూపురం ఫలితం కోసం ఏపీ ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: