సర్వత్రా ఉత్కంఠ.. బాబు, జగన్‌లలో సీఎం ఎవరో మధ్యాహ్నానికే తేలిపోనుందా?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం అంతా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోట్ల మంది తెలుగు ప్రజల్లో చాలా మంది ఫలితాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచే ఫలితాల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. వాటి ఫలితాలు అంటే ఉద్యోగులు ఎవరి వైపు మొగ్గు చూపారో కౌంటింగ్ ప్రారంభించిన తొలి గంటలోనే తేలిపోనుంది. తర్వాత అసలైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోనుంది. తద్వారా ఏపీలో సీఎం పదవిని జగన్ చేపడతారా? లేక చంద్రబాబు దక్కించుకుంటారా అనే విషయం తేలనుంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రానుందో 10 గంటల సమయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోరాహోరీగా ఉండే స్థానాల్లో మాత్రం చివరి వరకు లెక్కింపు జరగనుంది. చివరి వరకు కౌంటింగ్ పూర్తయ్యాకే కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రౌండ్ రౌండ్‌కూ ఫలితాల్లో ఒక్కో అభ్యర్థికి ఆధిక్యత దక్కే అవకాశం ఉంది.
గెలుపు గుర్రాలు ఎవరో ఫలితాల విడుదల ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ప్రజలకు స్పష్టత రావొచ్చు. ఒక్కోసారి గెలుపు గుర్రాలు కూడా తొలుత వెనుకబడినా, తర్వాత చివర్లో గట్టెక్కే పరిస్థితి ఉంది. ఇక గత ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఇదే తరహాలో గెలిచారు. దీంతో అలాంటి నియోజకవర్గాల్లో చివరి వరకు ఫలితం తేలే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉండే అవకాశం ఉంది. అయితే 20 రౌండ్లలో ఫలితం వచ్చే నియోజకవర్గాలు ఏపీలో 11 ఉన్నాయి. అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఆ నియోజకవర్గాల్లో ఫలితం కొలిక్కి వస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్‌ 88ను ఆయా పార్టీలు సాధించాలి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకే అధికారం చేపట్టబోయేది ఎవరో తేలిపోనుంది. 61 నియోజకవర్గాల్లో మాత్రం 21 నుంచి 25 వరకు రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అంటే మొత్తం ఫలితాలు పూర్తిగా విడుదలయ్యేందుకు సాయంత్రం 4 గంటల వరకు ఎదురు చూడక తప్పదు. ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైఎస్ జగన్ ఆశగా ఉన్నారు. మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాక వారు కూడా బలంగా కనిపిస్తున్నారు. వివిధ సర్వే సంస్థల్లో కొన్ని వైసీపీకి, మరికొన్ని కూటమికి విజయావకాశాలు ఉన్నాయని తేల్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: