క‌న్నీటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ : ఏపీకి రాజ‌ధాని ఎప్ప‌ట‌కైయ్యేను.. ఈ బాధ ఎవ‌డు తీర్చేనూ..?

RAMAKRISHNA S.S.
- అమ‌రావ‌తి ప్ర‌పంచ రాజ‌ధాని అంటూ ఆర్భాటం చేసిన చంద్ర‌బాబు
- అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటూ జ‌గ‌న్‌ మూడు రాజ‌ధానులు
- వారంలో హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని గ‌డువు గోవిందా... ఏపీకీ రాజ‌ధాని లేదా..?
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నో  స‌మ‌స్య‌లు ఉన్నా.. అత్యంత కీల‌క‌మైన స‌మ‌స్య‌.. రాజ‌ధాని లేక పోవ‌డం. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. ఏపీకి ప్ర‌త్యేకంగా రాజ‌ధాని ఉండాల‌ని.. విబ‌జ‌న చ‌ట్టంలోనే పేర్కొన్నారు. దీనిని ప‌దేళ్ల‌లో నిర్మించుకోవాల‌ని.. దీనికి సంబంధించిన నిధుల సాయం కేంద్రం చేస్తుంద‌ని కూడా పేర్కొన్నారు. అప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా పేర్కొన్నారు. దీంతో 2014 నుంచి ప్ర‌స్తుత 2024 మ‌ధ్య రాజ‌ధానిని నిర్మించుకోవాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు తొలి కేబినెట్‌లోనే రాజ‌ధానికి బీజం వేశారు. అంద‌రికీ.. అన్ని జిల్లాల‌కు అనువుగా ఉండే అమరావ‌తి ప్రాంతాన్ని రాజ‌ధానిగా ఎంపిక చేశారు. పెద్ద ఎత్తున దీనికి క‌స‌ర‌త్తు కూడా చేశారు. మొత్తం 2500 కోట్ల రూపాయ‌లు వెచ్చించారు. రైతుల నుంచి భూ సేక‌ర‌ణ (పూలింగ్‌) ప‌ద్ధ‌తిలో 33 వేల ఎక‌రాల‌ను తీసుకున్నారు. క‌ట్ట‌డాల‌ను కూడా ప్రారంభించారు. ఇక‌, ఇత‌ర రాష్ట్రాల్లోని విద్యాసంస్థ‌లు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చాయి. అయితే.. 2019లో ప్ర‌భుత్వం మారిపోయింది.

అప్ప‌టి వ‌ర‌కు స‌మ‌ర్థించిన జ‌గ‌న్ అండ్‌కో దీనికి వ్య‌తిరేక‌మ‌య్యారు. ఇక్క‌డ అవినీతి జ‌రిగిందని.. ఒక సామాజిక వ‌ర్గానికి అనుకూలంగా దీనిని నిర్మాణం చేశార‌ని పేర్కొంటూ.. అమ‌రావ‌తిని నిలుపుద‌ల చేశారు. ఆ వెంట‌నే మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టించారు. విశాఖ‌ను పాల‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా పేర్కొన్నారు. కానీ.. ఇది కూడా ముందుకు సాగ‌లేదు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వెంటాడ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు ఐదేళ్ల కాలంలో రాజ‌ధాని లేకుండానే ముగించేసింది.

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం. ఒక‌వైపు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని గ‌డువు.. మ‌రో వారంలో తీరిపోతుంది. మ‌రోవైపు.. రాష్ట్రానికి రాజ‌ధాని లేదు. జ‌గ‌న్ మ‌రో సారి అధికారంలోకి వ‌స్తే.. విశాఖ నుంచి ప్ర‌మాణం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే.. అమ‌రావ‌తిని నిర్మిస్తామ‌ని చెప్పారు. అయితే.. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? అనేది ప్ర‌జ‌లు ఇప్ప‌టికే తేల్చి చెప్పారు. వీటి తాలుకు ఫ‌లితం.. జూన్ 4న వెల్ల‌డ‌య్యే వ‌ర‌కు రాజ‌ధానిపై స్ప‌ష్టత లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: