టార్గెట్ పిన్మెల్లి: 10 రోజుల వ‌ర‌కు వీడియో బ‌య‌ట‌కు ఎందుకు రాలేదు?

Suma Kallamadi
ఎన్నికల పుణ్యమాని ఏపీలో ఇపుడు ఎక్కడ విన్నా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మాత్రమే వినబడుతోంది. ఎన్నికల రిజల్ట్స్ కి ముందు పిన్నెల్లి పేరు ఎందుకు వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనతో ఆయన పేరు ఇపుడు మారుమ్రోగిపోతోంది. ఇక ఈ సంఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
ఇకపోతే 2004 నుంచి నేటిదాకా పల్నాడు జిల్లాల్లోని మాచర్ల నియోజకవర్గంలో రాజకీయంగా పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోందనే చెప్పుకోవాలి. ఇన్నేళ్ళలో ఆయనపై ఒక కేసు కూడా అక్కడ నమోదు కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిణామాలపైన స్థానిక ప్రజలకు అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఏనాడూ ఎవరినీ కావాలని ఇబ్బంది పెట్టని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం బాక్స్ ని ఎందుకు బద్దలు కొట్టాల్సి వచ్చిందన్న విషయంపైన సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుకుంటున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఎటువంటి విజయం పొందారో అందరికీ తెలిసిందే.
అదలా ఉంటె అదే నియోజక వర్గంలో ఆయనికి పోటీగా జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ రంగంలోకి దించిన సంగతి విదితమే. జూలకంటి బ్రహ్మారెడ్డిది కూడా మాచర్ల ప్రాంతమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ఏడు ఫ్యాక్షన్ హత్యల కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంటారు అక్కడి జనాలు. ఈ నేపథ్యంలోనే జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదంతా ఒకెత్తయితే ఎన్నికలు జరిగిన 10 రోజుల వ‌ర‌కు సదరు వీడియో బ‌య‌ట‌కు రాకపోవడం ఇపుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. అక్కడ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హవాను తట్టుకొని రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. అందుకే టీడీపీ ఆయనకి టికెట్ కట్టబెట్టింది. ఈ కిరికిరి వెనక ఈయనగారి హస్తం ఉందేమోనని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి జనాలు. దీంతో భవిష్యత్తులో ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో అనే ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: