రాజ‌మండ్రి సిటీలో గెలుపు ఎవ‌రిది... వైసీపీ భ‌ర‌త్‌.. టీడీపీ వాసులో టెన్ష‌న్ ఎవ‌రికి..?

RAMAKRISHNA S.S.
రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. జిల్లా వ్యా ప్తంగా ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల కంటే కూడా.. రాజ‌మండ్రి సిటీలో పోరు ఉద్రిక్తంగాను.. ఉత్కంఠ‌గాను సాగింది. వైసీపీ నుంచి ఎంపీ భ‌ర‌త్ రామ్ పోటీ చేయ‌గా.. ఇక్క‌డి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు బ‌రిలో ఉన్నారు. ఇరువురు కూడా తీవ్ర‌స్థాయిలో ఎన్నిక‌ల పోరు చేశారు. అభివృద్ధి స‌హా అక్ర‌మాల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి తీసుకువెళ్లారు.

దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఇద్ద‌రి ప్ర‌చారం ఒక‌ర‌కంగా జోరెత్తింది. దీనికి తోడు ఎంపీ అభ్య‌ర్థి పురందేశ్వ‌రి కూడా టీడీపీకి సానుకూలంగా ప్ర‌చారం చేశారు. ఎమ్మెల్యే అభ్య‌ర్థికి ప‌డే ఓట్లు త‌న‌కు కూడా.. ప‌డ‌తాయ‌ని ఆమె ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్ కంటే కూడా.. ఎమ్మెల్యే అభ్య‌ర్థి భ‌ర‌త్ ఎక్కువ‌గా ఇక్క‌డ ప్ర‌చారం చేశారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ న‌మోద‌వుతుంద‌ని అంచ‌నా వేసుకున్నారు. కానీ, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చాలా త‌క్కువ‌గా న‌మోదైంది.

గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. దాదాపు 3-5 శాతం మేరకు త‌గ్గింది. తాజా ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో 67.57 శాత‌మే పోలింగ్ న‌మోదైంది. స‌హ‌జంగానే ప‌ల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ‌గా న‌మోదు కావ‌డంతోవైసీపీ శిబిరంలో అంచ‌నాలు ఊపందుకున్నాయి. త‌న గెలుపుపై ఎంపీ భ‌ర‌త్ సంతోషంవ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వాసు కూడా గెలుపుపై ధీమానే ప్ర‌ద‌ర్శిస్తున్నా.. పోలింగ్ ప‌ర్సంటేజీపై మాత్రం టెన్ష‌న్‌గానే ఉన్నారు.

యువ‌త‌పెద్ద‌గా క‌దిలిరాలేదు. కానీ, రాష్ట్రంలో మాత్రం యువ‌త పెద్ద ఎత్తున ఓట్లేశారు. ఇక‌, మ‌హిళ‌లు మాత్రం పోటెత్తారు. అయితే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇస్తున్న సంక్షేమం కార‌ణంగానే మ‌హిళ‌లు వ‌చ్చార‌ని వైసీపీ చెబుతుండ‌గా..కాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన‌.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణాలు, ప్ర‌తి నెలా రూ.1500 వంటి వాటికి ముగ్ధుల‌య్యార‌ని..వాసు వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. దీంతో ఇరు ప‌క్షాల్లోనూ.. కొంత మేర‌కు టెన్ష‌న్ నెల‌కొంది. పోలింగ్ ప‌ర్సంటేజీ త‌గ్గ‌డంతో అధికార పార్టీకి మేలు జ‌రుగుతుంద‌నే లెక్క‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: