చంద్ర‌బాబుపై ఇప్ప‌టికీ అదే డౌట్‌... ఈ సైలెన్స్‌కు అర్థ‌మేంటో..?

RAMAKRISHNA S.S.
- ఏదీ ఉచితంగా రాద‌నే బాబు ఈ ఎన్నిక‌ల్లో ఉచితాలతోనే రాజ‌కీయం
- చివ‌రి రెండు రోజుల్లో ఉచితాలు వ‌దిలేసి టైటిలింగ్ యాక్ట్‌పై ప్ర‌చారం
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంస్క‌ర్త‌గా పేరుంది. ఆయ‌న విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తార‌నే న‌మ్మ‌కం కూడా ప్ర‌బ‌లంగా ఉంది. గ‌తంలో ఆయ‌న సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేసిన మాట నిజం. ఏదీ ఉచితంగా రాద‌నే ధోర‌ణినే ఆయ‌న అవ‌లంభించారు. డ్వాక్రా పొదుపు సంఘాల‌ను ప్రోత్స‌హించి.. స్వ‌తంత్రంగా వారు సంపాయించుకునే మార్గాలు చూపించారు. అదేవిధంగా ఐటీని అభివృద్ధిచేసి.. యువ‌త‌కు ఉపాధి చూపించారు.

అంతేకాదు.. ఆయ‌న పాల‌నా కాలంలోనూ.. బీసీల‌ను కూర్చోబెట్టి ఎక్క‌డా ఎలాంటి మేళ్లూ చేయ‌లేదు. వారికి కూడా సంపాయించుకునే మార్గ‌మే చూపించారు. చేతి వృత్తుల వారికి ప‌నిముట్లు ఇచ్చారు. ప‌ని క‌ల్పించారు. ప‌ని చేసుకుని ప‌ది రూపాయ‌లు సంపాయించుకునేలా వారిని ప్రోత్స‌హించారు. దీనిని ఆయ‌న చెప్పుకోలేక‌పోయారు. కానీ, వాస్త‌వం. ఎక్క‌డా ఉచితంగా ఆయ‌న రూపాయి పంచింది లేదు. దీనికి ఆయ‌న వ్య‌తిరేకం కూడా. సొంత పార్టీలో అయినా.. కుటుంబంలో అయినా ఇంతే.

ఇలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఉచితాల‌కు మొగ్గు చూపించారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం అన్నారు. నెల‌కు రూ.1500 నిధి అన్నారు. పింఛ‌న్లు పెంచుతామ‌ని చెప్పారు. నిరుద్యోగ భృతిని రూ.3000 ఇస్తామ‌న్నారు. ఇంటికి ఏటా మూడు సిలిండ‌ర్లు ఇస్తామ‌ని తెలిపారు. ఇలా.. ఒక‌టి కాదు.. ఏకంగా 6 హామీలు ఇచ్చారు. ఇవ‌న్నీ కూడా.. ఉచితాలే. రైతుల‌కు ఏటా రూ.20000 ఇన్ పుట్‌స‌బ్సిడీ ఇస్తామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల వేళ విస్తృతం గా ప్ర‌చారం చేశారు. కానీ, కీల‌క‌మైన పోలింగ్ స‌మ‌యానికి రెండు రోజుల ముందు మాత్రం ఈ ఉచితాల‌పై నెమ్మ‌దించారు. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన టైటిలింగ్ యాక్ట్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేశారు.

దీంతో చంద్ర‌బాబు ఉచితాల‌పై అనుమానాలు నెల‌కొన్నాయి. ఇక‌, ఇప్పుడు పోలింగ్ ముగిసింది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కానీ.. టీడీపీ నాయ‌కులు కానీ.. నోరు విప్ప‌డం లేదు. మేనిఫెస్టో గురించి మాట కూడా మాట్లాడ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబుపై ఇప్ప‌టికీ అదే డౌట్ కొన‌సాగుతోంది. మ‌రిఆయన అమ‌లు చేస్తారా?  చేయ‌రా?  క్లారిటీ ఎప్పుడు ఇస్తార‌నే ప్ర‌శ్న అయితే.. తెర‌మీదికి వ‌స్తోంది. చూడాలి బాబు వ్యూహం ఎలా ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: